ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?

14 Dec, 2022 09:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ (ఏపీఏటీ) రద్దు తరువాత అక్కడి ఉద్యోగులు డిప్యుటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తుండగా, తమను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టులో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఏటీ ఉద్యోగులను ఇతర శాఖలకు పంపాలనుకోవడం సరైన చర్యకాదని అభిప్రాయపడింది. వారు గతంలో కొద్దికాలం తమ వద్ద పనిచేశారని, కాబట్టి వారు తమ వద్దే పనిచేయడం సబబని తెలిపింది.

ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ స్పందిస్తూ.. హైకోర్టును సంప్రదించకుండా ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ విషయంలో లేఖ రాయడం తప్పేనన్నారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఆ లేఖను ఇప్పటికే ఉపసంహరించుకున్నామని ఆయన కోర్టుకు నివేదించారు. అయితే, ఏపీఏటీ ఉద్యోగులు హైకోర్టులో పనిచేయడానికి నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో హైకోర్టుతో ప్రభుత్వాధికారులు చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు.

ఏజీ చెప్పిన ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. కోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.  

సిబ్బంది లేఖ రాయడం క్రమశిక్షణారాహిత్యం 
హైకోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులను వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల హైకోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హైకోర్టులో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులు తమను ఇతర శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి నేరుగా లేఖ రాయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.

ఇది క్రమశిక్షణారాహిత్యమేనని తెలిపింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఓ ఉద్యోగి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఆమె అక్కడే కొనసాగించేందుకు దయతో అనుమతినివ్వాలన్న ఆ ఉద్యోగిని తరఫు సీనియర్‌ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము దయతో కాకుండా కేసులో ఉన్న దమ్మును బట్టి ఉత్తర్వులిస్తామంది.

హైకోర్టులో చాలామంది ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్‌ వెళ్తున్నారని, జడ్జీలు కూడా వెళ్తున్నారని, ఇలా అందరూ హైదరాబాద్‌కు వెళ్తే  విజయవాడలో ఎవరుంటారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టుతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది.  

(చదవండి: ‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు)

మరిన్ని వార్తలు