‘అమర్‌రాజా’లో ప్రమాదకర స్థాయిలో లెడ్‌

13 Jul, 2021 04:13 IST|Sakshi

కార్మికుల రక్తంలో ఆందోళనకర స్థాయిలో లెడ్‌ శాతం 

గాలి, నీరు, భూమిలోనూ ప్రమాదకరంగా ఉంది 

దీన్ని వెంటనే తగ్గించకపోతే ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది 

యాజమాన్యానికి హైకోర్టు హెచ్చరిక  

సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర స్థాయిలో లెడ్‌ కాలుష్యం వెలువడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికుల రక్తంలోనూ లెడ్‌ శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించింది. గాలి, నీరు, భూమిలో కూడా లెడ్‌ శాతం ప్రమాదకరస్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యాన్ని  హెచ్చరించింది. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసివేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది.

అమర్‌రాజా ఫ్యాక్టరీలో లెడ్‌ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఈపీటీఆర్‌ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ కాలుష్య నివేదికలు సరికాదన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. నివేదికలోని అంశాలను తాము సమగ్రంగా పరిశీలించామని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు