అమరావతికి ఎంత ఖర్చుచేశారు? 

7 Aug, 2020 09:08 IST|Sakshi

నిర్మాణాలు ఆపేయడంవల్ల ఎంత నష్టం వాటిల్లింది? 

పూర్తి వివరాలు మా ముందుంచండి 

పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం 

అన్ని వ్యాజ్యాలు 14వ తేదీ వ్యాజ్యాలకు జత 

సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు.. నిర్మాణాలన్నింటినీ ఆపేయడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం ఎంత.. తదితర వివరాలను అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతోపాటు పలు ఇతర అభ్యర్థనలతో గతంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన త్రిసభ్య ధర్మాసనం, వాటిపై గురువారం మరోసారి విచారణ జరిపింది. నిర్మాణాలపై చేసిన వ్యయం ప్రజల డబ్బు అని.. అది దుర్వినియోగమైతే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది.

ఖజానాకు వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు.. దానిని ఎలా రాబట్టాలన్న విషయాలను తదుపరి విచారణల్లో తేలుస్తామని తేల్చిచెప్పి తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలను కూడా 14న విచారణకు రానున్న వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం.. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై గతంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలూ విచారణకు రాగా, బిల్లులు చట్టాలుగా మారాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు నిరర్థకమని అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యుల తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తెలిపారు. అయితే, ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని 14న రానున్న వ్యాజ్యాలకు జతచేసింది. ఇలా మిగిలిన అన్ని వ్యాజ్యాలను కూడా 14వ తేదీ వ్యాజ్యాలకు జతచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, నవరత్నాల ఇళ్ల పట్టాల వ్యాజ్యాలను మాత్రం వాటితో జతచేయలేదు.   

మరిన్ని వార్తలు