గెస్ట్‌హౌస్‌ నిర్మాణంపై హైకోర్టు విచారణ..

6 Oct, 2020 17:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: విశాఖలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం.. ఎక్కడైతే సీఎం ఉండి పని చేస్తారో అదే క్యాంప్‌ ఆఫీస్‌ అని ఏజీ పేర్కొన్నారు. స్టేట్‌ కార్పొరేషన్‌లు అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. మాజీ సీఎంకు హైదరాబాద్‌, ఆయన నివాసం ఉంటున్న గ్రామం కూడా క్యాంప్‌ ఆఫీస్‌ అని పోలీసు అధికారులు తెలిపారని, మాజీ సీఎంకు నారావారిపల్లిలో, హైదరాబాద్‌ పార్క్‌హయత్‌లో క్యాంప్‌ ఆఫీసులున్నాయని ఏజీ తెలిపారు. క్యాంప్‌ ఆఫీసుల ఏర్పాటుపై పూర్తిస్థాయి అఫిడవిట్‌ను శుక్రవారం వేస్తామని ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

స్టేటస్‌ కో ఎత్తేయాలి.. 
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్‌ కో ఎత్తేయాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. బిల్లులపై జనవరిలో జరిగిన మండలి చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో సీడీలను సీల్డ్‌కవర్‌లో ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.

ప్రాధాన్యత క్రమంలో కేసులు విచారణ: హైకోర్టు
రాజధాని అంశంపై వేసిన పలు పిటిషన్లలో దాఖలైన అనుబంధ పిటిషన్లను 12 విభాగాలుగా చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ నెల 9 నుంచి ప్రాధాన్యత క్రమంలో కేసులను విచారిస్తామని, ఈలోపు కౌంటర్లు వేయాల్సిన వారు వేయాలని ధర్మాసనం ఆదేశించింది. కొత్త చట్టాలు, నిపుణుల కమిటీ, రాజధాని తరలింపు, కార్యాలయాల తరలింపు,  R5 జోన్ తదితర 12 విభాగాలుగా అనుబంధ పిటిషన్లు విభజించి.. మొదటి ప్రాధాన్యత క్రమంలో భాగంగా షిఫ్టింగ్ క్యాపిటల్, మండలిలో జరిగిన పరిణామాలు, విశాఖ గెస్ట్ హౌస్ పై ఈ నెల 9న విచారణ జరపనుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర తరపున అభిప్రాయాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. అనుబంధ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. గతంలో అమరావతి కట్టకూడదని ఏమన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారా అని పలువురు పిటిషనర్లను న్యాయస్థానం ప్రశ్నించగా, తాము వేయలేదని కోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తలు