కరోనా కట్టడికి గట్టి చర్యలు కొనసాగించండి

1 Sep, 2021 03:00 IST|Sakshi

పాఠశాలల్లో కరోనా కట్టడికి ఏం చేస్తున్నారో చెప్పండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య తక్కువగా ఉందన్న ఉద్దేశంతో ఎంతమాత్రం ఉదాసీన వైఖరితో ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. థర్డ్‌వేవ్‌పై నిపుణులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి గట్టి చర్యలను కొనసాగించాలని ఆదేశించింది. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలంది. కొన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయని, ఈ విషయాన్ని ఎంత మాత్రం విస్మరించవద్దని, పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్‌కు సంబంధించి వేర్వేరు అభ్యర్థనలతో హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. 

ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా వైరస్‌ తీవ్రత, మృతుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ధర్మాసనం ఆరా తీయగా.. రాష్ట్రానికి 28 ఆక్సిజన్‌ ప్లాంట్లు కేటాయించామని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ చెప్పారు. ఇప్పటికే 18 ఏర్పాటయ్యాయని, మరో 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఏజీ శ్రీరామ్‌ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకున్న ధర్మాసనం అన్ని వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

పాఠశాలలు తెరవడం ఎంతవరకు సముచితం
కోవిడ్‌ తీవ్రత ఇంకా తగ్గనప్పటికీ రాష్ట్రంలో పాఠశాలల్ని పునః ప్రారంభించడం ఎంతవరకు సముచితమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులు కరోనా బారిన పడితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. ఉపాధ్యాయులకు మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తే సరిపోదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరికీ కూడా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయకుండా పాఠశాలలు తెరవాలన్న నిర్ణయం అనాలోచితమని పేర్కొంది. సచివాలయంలో కూర్చుని ఉత్తర్వులు ఇస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పాఠశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్‌ చినవీరభద్రుడు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తదితరులు హాజరయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు.   

మరిన్ని వార్తలు