హెచ్చార్సీకి కల్పించిన మౌలిక సదుపాయాలేంటి?

26 Jan, 2022 05:14 IST|Sakshi

ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులెన్ని?

అఫిడవిట్‌ దాఖలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)కు కర్నూలులో కల్పించిన మౌలిక సదుపాయాలు ఏమిటి? కమిషన్‌లో ఇప్పటివరకు దాఖలైన ఫిర్యాదులు ఎన్ని? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పేర్కొంది. వాటి ఆధారంగా తగిన ఆదేశాలు ఇస్తామంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఆర్‌సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదులు తీసుకుని విచారించడం సాధ్యం కావడం లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుతూ అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ మరో పిల్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారించింది. మల్లేశ్వరరావు న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ కర్నూలులో హెచ్‌ఆర్‌సీ ఓ అతిథి గృహంలో కొనసాగుతోందని చెప్పారు. కేవలం భౌతికరూపంలో, పోస్టు ద్వారా మాత్రమే ఫిర్యాదులను పంపే వెసులుబాటు ఉందే తప్ప, ఆన్‌లైన్‌లో పంపే ఏర్పాటు హెచ్‌ఆర్‌సీ చేయలేదన్నారు. దీంతో ఫిర్యాదులు పంపడం కష్టంగా ఉందన్నారు.

ఈ సమయంలో మద్దిపాటి శైలజ న్యాయవాది డి.ఎస్‌.ఎన్‌.వి.ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ లోకాయుక్త పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉందని చెప్పారు. విజయవాడలో కోట్ల రూపాయలు వెచ్చించి కార్యాలయం సిద్ధం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కర్నూలులో లోకాయుక్త ఏర్పాటునకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హెచ్‌ఆర్‌సీకి కల్పించిన మౌలిక సదుపాయాలు, ఫిర్యాదుల స్వీకరణ యంత్రాంగం, ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు? తదితర వివరాలతో ఓ చిన్న అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ను ఆదేశించింది.  

మరిన్ని వార్తలు