గండికోట పరిహారంపై అన్ని వ్యాజ్యాలను కలిపి విచారిస్తాం 

24 Sep, 2020 04:41 IST|Sakshi

పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి 

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

విచారణ ఈ నెల 25కి వాయిదా 

సాక్షి, అమరావతి: గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదంటూ ఓ రాజకీయ నాయకుడు దాఖలు చేసిన వ్యాజ్యం ఓ వైపు.. ప్రభుత్వం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిందని, ఇక్కడ సీసీ రోడ్లకు బదులు మట్టి రోడ్లు వేస్తున్నారంటూ పరిహారం తీసుకున్న వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యం మరో వైపు ఉండటంతో ఈ రెండిటిని కలిపి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. పరిహారం విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి, రెండు రోజుల పాటు గండికోట రిజర్వాయర్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసి, అక్కడి ప్రజల ప్రాణాల రక్షణ కోసం చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేసింది. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు కూడా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం విచారణ జరిపింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా