బదిలీల మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోలేం

20 Mar, 2022 04:51 IST|Sakshi

తేల్చి చెప్పిన హైకోర్టు  

సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శకాలు రాజ్యాంగంలోని అధికరణ 309 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదని, అందువల్ల ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులు, ఏపీ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్న ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది. అధికరణ 309 ద్వారా మార్గదర్శకాలను రూపొందించనప్పుడు, వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలిపింది.

అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలు మాత్రమేనంది. వాటిపై అభ్యంతరాలు ఉంటే ఆయా ఉద్యోగులు సవాలు చేసుకోవచ్చునంది. బదిలీల మార్గదర్శకాలను, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు