టీటీడీ ఈవో పోస్టుకు ధర్మారెడ్డి అర్హుడే: హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

16 Sep, 2022 08:27 IST|Sakshi

సాక్షి, అమరావతి:  డిప్యుటేషన్‌పై టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏవీ ధర్మారెడ్డికి ఇన్‌చార్జ్‌ ఈవోగా బాధ్యతలు అప్పగించడంపై దాఖలైన కోవారెంటో పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈవోగా నియామకానికి ధర్మారెడ్డి అర్హుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. 

ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌(ఐడీఈఎస్‌)లో ధర్మారెడ్డి జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారని, అది రాష్ట్ర సర్వీసులో కార్యదర్శి స్థాయి పోస్టు అని, ఇదే సమయంలో కలెక్టర్‌ పోస్టు కన్నా పెద్ద పోస్టు అని.. కలెక్టర్‌ కన్నా ఎక్కువ హోదా కలిగిన పోస్టులో నియమితులయ్యేందుకు అర్హతలున్న వ్యక్తి టీటీడీ ఈవోగా నియమితులు కావొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. దీని ప్రకారం ధర్మారెడ్డిని పూర్తిస్థాయి ఈవోగా టీటీడీ నియమించడంలో ఎలాంటి తప్పులేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం తీర్పు వెలువరించారు. 

ఐడీఈఎస్‌ అధికారి అయిన ధర్మారెడ్డికి ఐఏఎస్‌ అధికారి నిర్వర్తించే టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించడం చట్ట విరుద్ధమంటూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో కోవారెంటో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ గురువారం తీర్పు వెలువరించారు. అందులో ఈవో నియామకానికి సంబంధించిన చట్ట నిబంధనలపై సవివరంగా చర్చించారు. 

దేవదాయ చట్టంలోని సెక్షన్‌–107 కింద అఖిల భారత సర్వీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు చెందిన ఏ అధికారినైనా ఈవోగా నియమించవచ్చని, అయితే, ఆ అధికారం కలెక్టర్‌ కన్నా ఎక్కువ హోదా ఉంటే సరిపోతుందన్న ధర్మారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సర్వ సత్యనారాయణప్రసాద్‌ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ధర్మారెడ్డి గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో పనిచేశారని న్యాయమూర్తి తన తీర్పులో గుర్తుచేశారు. నవీన్‌కుమార్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేశారు.  

మరిన్ని వార్తలు