సీజే జస్టిస్‌ గోస్వామికి హైకోర్టు ఘన వీడ్కోలు

11 Oct, 2021 05:59 IST|Sakshi
చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి దంపతులకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేస్తున్న ఆలయ ఈవో భ్రమరాంబ

సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామికి ఆదివారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ గోస్వామి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి చాలా కఠినమైనదని, సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు.

ఈ వృత్తి జీవితంలో పైకొచ్చిన తరువాత కూడా నిత్యం సవాళ్లను ఎదుర్కొంటునే ఉంటామన్నారు. ఆశను ఎప్పుడూ వదులుకోకూడదని చెప్పారు. విజయానికి దగ్గరిదారులు వెతకొద్దని, కష్టపడే తత్వానికి ప్రత్యామ్నాయం లేనేలేదని పేర్కొన్నారు. తక్కువ కాలమైనా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడం తనకు ఎంతో సంతోషానిచ్చిందన్నారు. తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఏజీ శ్రీరామ్‌ మాట్లాడుతూ జస్టిస్‌ గోస్వామి సేవలను కొనియాడారు.

గవర్నర్‌ తేనీటి విందు: బదిలీపై వెళుతున్న చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి గౌరవార్థం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి తేనేటి విందు ఇచ్చారు. సీజే గోస్వామి, నీలాక్షి గోస్వామి దంపతులను గవర్నర్‌ సత్కరించి వీడ్కోలు పలికారు. గవర్నర్‌ సతీమణి సుప్రవ హరిచందన్, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. 

దుర్గమ్మ సేవలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌
వించిపేట (విజయవాడ పశ్చిమ): శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం శ్రీలలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీజే గోస్వామి దంపతులకు ఈవో భ్రమరాంబ, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం చీఫ్‌ జస్టిస్‌కు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

జస్టిస్‌ పీకే మిశ్రా సీజేగా 13న ప్రమాణం 
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఈ నెల 13న ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన చేత గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, న్యాయమూర్తులు, మంత్రులు తదితరులు పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి జస్టిస్‌ మిశ్రా ఈ నెల 12న విజయవాడ చేరుకుంటారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు పరిశీలించారు. 

మరిన్ని వార్తలు