ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత

3 Sep, 2021 04:50 IST|Sakshi

అమరావతి భూ కొనుగోళ్లలో ‘దమ్మాలపాటి’ తదితరులపై కేసు చెల్లదు 

ఆయన ఎలాంటి నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడలేదు 

రాష్ట్ర రాజధాని నిర్ణయం ప్రక్రియలో ఆయన పాలుపంచుకోలేదు 

రాజధాని ఎక్కడ వస్తుందన్నది రహస్యమేమీ కాదు.. 2014 జూన్‌ నుంచి అది జన బాహుళ్యంలో ఉంది 

రాష్ట్ర హైకోర్టు తీర్పు  

సాక్షి, అమరావతి: అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసును రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. తనపై తప్పుడు ఫిర్యాదుచేసి వేధింపులకు గురిచేసినందుకుగాను తనకు పరిహారం ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యంలో అలాంటి పరిహారం చెల్లింపునకు ఆదేశాలివ్వలేమని.. అయితే, పరిహారం కోసం, ఖర్చుల కోసం ఫిర్యాదుదారుణ్ణి కోరే స్వేచ్ఛను దమ్మాలపాటికి హైకోర్టు ఇచ్చింది. అదనపు ఏజీ ఎలాంటి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన బాధ్యతలు, విధులు నిర్వర్తించరని.. రాజధాని ఎక్కడ ఉండాలన్న నిర్ణయంలో ఆయన పాత్ర ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది.

కాబట్టి రాజధాని విషయంలో ఆయన ఎలాంటి రహస్యాలను బహిర్గతం చేసే అవకాశం కూడా లేదని చెప్పింది. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితులు భూములు కొనుగోలు చేశారనడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే, దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఎలాంటి నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడలేదని.. ఆయనపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని తెలిపింది. రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ఎంతమాత్రం రహస్యం కాదని.. 2014 జూన్‌ నుంచి అది జన బాహుళ్యంలోనే ఉందని చెప్పింది. ఆస్తి సముపార్జన రాజ్యాంగ, న్యాయబద్ధ హక్కు అని, ఇది ఈ దేశ పౌరులందరికీ ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది.

నిర్ణీత మొత్తానికి స్వచ్ఛంధంగా భూములు అమ్మేవారి నుంచి భూములు కొనుగోలు చేయడం ఎంతమాత్రం నేరంకాదని.. అలా భూములు కొనుగోలు చేసిన పిటిషనర్లందరికీ కూడా ఎలాంటి నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టంచేసింది. వీరిని ఐపీసీ సెక్షన్‌–420 కింద, అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేయడానికి వీల్లేదని పేర్కొంది. భూములు అమ్మి ఎలాంటి నష్టానికి గురికాలేదని, ఇందులో ఎలాంటి కుట్రను కూడా ఆపాదించడానికి ఆస్కారంలేదని తెలిపింది. ఏ రకంగా చూసినా కూడా పిటిషనర్లపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ న్యాయ మౌలిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు న్యాయ ప్రక్రియ దుర్వినియోగమేనని.. అందుకే న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం తీర్పు వెలువరించారు..

కేసు నేపథ్యం ఇదీ..
అమరావతి భూ కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే, ఏసీబీ సెప్టెంబర్‌ 20న కేసు నమోదు చేయడంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్‌మోషన్‌ రూపంలో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో వార్తలు రాయడంవల్ల తమ పరువుపోతోందని, అందువల్ల ఆ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా వాటిని నియంత్రించాలని కోర్టును కోరారు.

దమ్మాలపాటి కోరిన ఉత్తర్వులే కాకుండా ఏకంగా దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ఉత్తర్వులిచ్చారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్‌ మీడియాను ఆదేశిస్తూ గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే వాదనలు వినిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.

ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు, పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. నాలుగు వారాల్లో కేసు తేల్చాలని హైకోర్టుకు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన సతీమణి నాగరాణి, సమీప బంధువులు నన్నపనేని సీతారామరాజు, నన్నపనేని లక్ష్మీనారాయణ, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు.  

మరిన్ని వార్తలు