ఆన్‌లైన్‌ టికెట్ల విధానంలో తప్పేముంది?

20 Jan, 2022 03:13 IST|Sakshi

పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకే ఈ విధానం 

ఈ విధానం వల్ల ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లడం లేదు 

ఆన్‌లైన్‌ గురించి ప్రజలకు తెలియదనుకోవడం పొరపాటు 

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ 

జీవో 142పై ప్రభుత్వానికి నోటీసులు.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం 

తదుపరి విచారణ ఫిబ్రవరి 16కి వాయిదా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయిస్తే పన్నుల ఎగవేతను అడ్డుకోవచ్చునని, ఇందుకోసమే ఆ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపింది. దీనివల్ల ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లదని కూడా తేల్చి చెప్పింది. ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్ల విక్రయానికి జారీ చేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఏపీఎఫ్‌డీసీలకు నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆన్‌లైన్‌ టికెట్ల విధానాన్ని సవాలు చేస్తూ ఈ  వ్యాజ్యాన్ని దాఖలు చేశామని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తప్పేముందని ప్రశ్నించింది.

అది గుత్తాధిపత్యం అవుతుందని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పన్నుల ఎగవేతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని ప్రకాశ్‌రెడ్డి అనగా, ఈ వ్యవహారంలో ప్రాథమిక హక్కులు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. దీనిపై ధర్మాసనం విబేధిస్తూ, ‘ఆన్‌లైన్‌ గురించి తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు ప్రపంచమంతా ఆన్‌లైన్‌ ద్వారానే పనిచేస్తోంది. ఆన్‌లైన్‌లో సినిమాలు ఎలా చూడాలో జనాలకు బాగా తెలుసు.

మీరు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే వాదనలు వినిపిస్తున్నారు. ఆన్‌లైన్‌ గురించి ప్రజలకు తెలియదనుకోవడం పొరపాటు’ అని వ్యాఖ్యానించింది. ముందు నోటీసులు జారీ చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ చేపట్టాలన్న ప్రకాశ్‌రెడ్డి అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు.

జీవో 35పై విచారణ వాయిదా
సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీఎల్‌ నర్సింహారావు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి సురేశ్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. తుది విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు