మీ సదుద్దేశాలపై  అనుమానం కలుగుతోంది

23 Feb, 2021 05:30 IST|Sakshi

ఈ మాట చెప్పేందుకు ఈ కోర్టు సందేహించడంలేదు 

ధిక్కార పిటిషన్‌ వేయడానికి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? 

మీ తాజా అభ్యర్థనలతో మాకు సంబంధంలేదు 

మా ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసిందా? అన్నదే చూస్తాం 

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు 

తదుపరి విచారణ మార్చి 22కి వాయిదా 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సదుద్దేశాలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మాట చెప్పేందుకు ఈ న్యాయస్థానం ఎంతమాత్రం సంశయించడంలేదని తెలిపింది. ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుంటే, వెంటనే ఎందుకు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఆ తరువాత కూడా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసి, అది విచారణకు రాకున్నా కూడా పట్టించుకోలేదని.. 42 రోజులపాటు ఆ పిటిషన్‌ను అలా వదిలేశారంటే ఎన్నికల కమిషనర్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించింది. ఇక్కడే ఎన్నికల కమిషనర్‌ తీరుపై ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయంది.

కేసు పూర్వాపరాలివీ.. ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ మొత్తాలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌.. కమిషన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్‌ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని అమలుచేయలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ దేవానంద్‌ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌. అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను అధికారులు అమలుచేయలేదన్నారు. కొత్త ఓటర్ల జాబితా తయారుచేయలేదని తెలిపారు. దీంతో 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు.

ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. గత ఏడాది నవంబర్‌ 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలకే ఈ కోర్టు పరిమితం అవుతుందని తెలిపారు. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారా? లేదా? అన్నదే చూస్తామన్నారు. ఒకవేళ తాజా సమస్యలపై ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుంటే, వాటిపై మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని, వాటిని ఈ వ్యాజ్యంలో కలపవద్దని స్పష్టంచేశారు. అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేశామన్నారు. నిజమైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను అమలుచేయలేదన్న న్యాయమూర్తి, దీనిపై స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలను ఆదేశించారు. ముందు కౌంటర్‌ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని సుమన్‌ అభ్యర్థించడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను మార్చి 22కి వాయిదా వేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు