మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

9 May, 2021 12:55 IST|Sakshi

5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు

ఐదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక

తక్షణ నష్టపరిహారంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు

గాయపడ్డవారికి రూ.5లక్షలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లాలోని మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్‌, సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్‌ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.  

ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి తక్షణ నష్టపరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎంజీ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని  మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదన్నారు. చిన్న తరహా ఖనిజ నియమావళి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు

చదవండి: ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి
పూలింగ్‌.. భారీ కుట్ర

మరిన్ని వార్తలు