ఎస్సీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత 

30 Jun, 2021 05:10 IST|Sakshi

మంత్రి పినిపే విశ్వరూప్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయించిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక 27వ నోడల్‌ ఏజెన్సీ సమావేశం వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌లో మంగళవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు నూరు శాతం వినియోగంలో అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

2020–21లో షెడ్యూల్‌ కులాల ఉప ప్రణాళికలో 44 శాఖలకు రూ.19,430 కోట్లు కేటాయించగా రూ.13,672 కోట్లు ఖర్చు చేశారన్నారు. కేటాయించిన నిధుల్లో 12 శాఖలు 76 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయగా, 23 శాఖలు 25 నుంచి 51 శాతం ఖర్చు చేశాయని, 9 శాఖలు ఏ విధమైన నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. 2021–22లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 42 శాఖలకు రూ.17,403 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే మూడు నెలల (త్రైమాసిక) సమీక్ష సీఎం అధ్యక్షతన జరుగుతుందని, ఈలోగా నూరు శాతం నిధులు సద్వినియోగం చేయాలని మంత్రి సూచించారు.   

మరిన్ని వార్తలు