అలా.. జల విహారం!

19 Apr, 2022 03:11 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ  

పర్యాటక శాఖకు అధిక ఆదాయం 

మూడు కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు 

రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదన దశలో ప్రాజెక్టు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జల విహారానికి (బోటింగ్‌) ఆదరణ పెరుగుతోంది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోట్లు టూరిస్టులతో నిత్యం కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఏటా ఆదాయం రెట్టింపు అవుతుండడంతో పాటు ఒక్క బోటింగ్‌ నుంచే కార్పొరేషన్‌కు ఎక్కువ రాబడి వస్తుండడం విశేషం. ఈ క్రమంలో పర్యాటక శాఖ కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా విజయవాడ (భవానీ ద్వీపం), నాగార్జున సాగర్, విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో 40 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన స్టీల్‌ బోట్లను అందుబాటులోకి తేనుంది. వీటి కోసం సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తర్వాతి దశలో రాజమండ్రి, శ్రీశైలంలోనూ కొత్తవి తీసుకురానున్నారు.  

గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం.. 
రాష్ట్రంలో ప్రస్తుతం 45 పర్యాటక శాఖ బోట్లు ఉండగా వాటిలో 40 బోట్లు నిత్యం నడుస్తున్నాయి. మరో 72 ప్రైవేటు బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా ఎక్కడికక్కడ బోటింగ్‌ నిలిచిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న రాబడి కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులను తలపిస్తుండటం విశేషం. కరోనా మొదటి వేవ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్‌ ప్రారంభమవగా సెప్టెంబర్‌ 2020 నుంచి ఏప్రిల్‌ 2021 (17వ తేదీ) వరకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్‌ వేవ్‌ విరామం అనంతరం సెప్టెంబర్‌ 2021 నుంచి ఏప్రిల్‌ 2022 (17వ తేదీ) వరకు రూ.4.72 కోట్ల రాబడి నమోదైంది.  ఇటువంటి తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది.  
 

బోటింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది! 
పర్యాటకులు జల విహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్‌ ద్వారా రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. డిమాండ్, అవసరాన్ని బట్టి కొత్త ప్రదేశాల్లోనూ బోటింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం.  
– ఆరిమండ వరప్రసాద్‌ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్‌  

మరిన్ని వార్తలు