డయాప్రెమాటిక్‌ హెర్నియా.. హైరిస్క్‌ సర్జరీ సక్సెస్‌ 

1 Dec, 2021 03:35 IST|Sakshi
రోగి జోగిరాజు (మధ్యలో లుంగీతో ఉన్న వ్యక్తి)తో సర్జరీ చేసిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది

ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లిన కాలేయం, చిన్నపేగులు 

అరుదైన డయాప్రెమాటిక్‌ హెర్నియాకు విజయవంతంగా శస్త్ర చికిత్స  

విజయవాడ జీజీహెచ్‌ వైద్యుల ఘనత 

లబ్బీపేట (విజయవాడ తూర్పు): అరుదుగా వచ్చే డయాప్రెమాటిక్‌ హెర్నియాకు విజయవాడ జీజీహెచ్‌ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. కార్పొరేట్, ప్రైవేటు వైద్యులు సైతం హైరిస్క్‌ అని చెప్పిన అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను నైపుణ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల బృందం సుసాధ్యం చేసి చూపించారు. విజయవాడ జీజీహెచ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యేకుల కిరణ్‌కుమార్, సర్జరీలో పాల్గొన్న వైద్యులు శస్త్ర చికిత్స వివరాలను తెలియజేశారు.  

అత్యంత అరుదు.. 
ప్రతి ఒక్కరికీ పొట్టకి, ఊపిరితిత్తులకు మధ్య కండరం గోడలా ఉంటుంది. ఆ కండరానికి చిల్లు పడటాన్ని డయాప్రెమాటిక్‌ హెర్నియా అంటారు. గోడలా ఉన్న కండరానికి ఎడమ వైపున చిల్లు పడటం సహజం, కుడివైపున చిల్లుపడటం అత్యంత అరుదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన వి.జోగిరాజు (48) ఈ రకమైన సమస్యతో బాధ పడుతున్నాడు. ఇతడికి కుడివైపున చిల్లు పడటంతో ఊపిరితిత్తుల్లోకి లివర్, పేగులు చొచ్చుకుని వెళ్లాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.  

ఛాలెంజ్‌గా తీసుకుని.. 
పలు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగిన జోగిరాజు అక్కడి వైద్యులు హై రిస్క్‌ కేసు అని చెప్పడంతో చివరగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రభుత్వ వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకు వెళ్లిన లివర్, చిన్న పేగులను సాధారణ స్థితికి తీసుకొచ్చి, కండరానికి మెస్‌ వేసి రిపేరు చేసినట్లు సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కందుల అప్పారావు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ టి.సూర్యశ్రీ అనస్థీషియన్‌ డాక్టర్‌ గీతాపద్మజ తదితరులు పాల్గొన్నారు. 

దేవుళ్లలా కాపాడారు.. 
వారికి నేను పాదాభివందనం చేస్తున్నా. అనేక ఆస్పత్రులు తిరిగాను. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులకూ వెళ్లాను. అక్కడ ఆపరేషన్‌కు రూ.5 లక్షలు అవుతాయని, అయినా హై రిస్క్‌ అని చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన నన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు దేవుళ్లలాగా కాపాడారు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది సేవలు చూశాక ప్రభుత్వాస్పత్రిలో సరిగా చూడరనే భావన తప్పని తెలిసింది. 
– జోగిరాజు, సర్జరీ చేయించుకున్న వ్యక్తి 

మరిన్ని వార్తలు