92.42 శాతం ఉత్తీర్ణత

11 Aug, 2022 02:49 IST|Sakshi
ఫలితాలను విడుదల చేస్తున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, తదితరులు

ఈసెట్‌ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి

36,440 మందికి గాను 33,657 మందికి అర్హత మార్కులు

14 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నట్లు చైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్‌–2022లో 92.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెట్‌ ఫలితాలను హేమచంద్రారెడ్డి, జేఎన్‌టీయూ (కాకినాడ) వైస్‌ చాన్సలర్‌ ప్రసాదరాజు మీడియాకు వెల్లడించారు. ఈసెట్‌కు 38,801 మంది దరఖాస్తు చేయగా 36,440 మంది పరీక్ష రాశారు. వీరిలో 33,657 మంది అర్హత మార్కులు సాధించారు.

ఉత్తీర్ణులైన వారిలో 26,062 మంది బాలురు కాగా 7,595 మంది బాలికలున్నారు. 14 విభాగాలకు గాను 11 విభాగాల అభ్యర్థులకే పరీక్షలు నిర్వహించారు. సిరామిక్‌ టెక్నాలజీలో 22 మంది, బీఎస్సీ మ్యాథ్స్‌లో 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా బయోటెక్నాలజీలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ మూడు విభాగాల వారికి పరీక్ష నిర్వహించలేదు. బీఎస్సీ మ్యాథ్స్, సిరామిక్‌ టెక్నాలజీ అభ్యర్థులకు వారి అర్హత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ప్రాథమిక ‘కీ’పై 1,100 అభ్యంతరాలు రాగా వాటిలో ఏడు ప్రశ్నలకు సంబంధించి వచ్చినవి మాత్రమే సరైన అభ్యంతరాలుగా పరిగణించారు.

వీటిలోనూ 4 ప్రశ్నల్లో 2 జవాబులు సరైనవిగా నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రశ్నలకు ఆ రెండు సమాధానాలు గుర్తించిన వారికి మార్కులు కలిపారు. మరో 3 ప్రశ్నలకు సంబంధించి తప్పిదం దొర్లడంతో.. సమాధానమిచ్చిన వారికి పూర్తి మార్కులు జత చేశారు. ఈసెట్‌లో 14 వేల వరకు సీట్లు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ వివరించారు. బీఎస్సీ మ్యాథ్స్‌ అభ్యర్థుల ర్యాంకులను వారి డిగ్రీ ఫలితాల అనంతరం ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ కె.రామ్మోహనరావు, ప్రొఫెసర్‌ లక్ష్మమ్మ, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కృష్ణమోహన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్, సెట్స్‌ ప్రత్యేక అధికారి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు