అందరికీ ఉన్నత విద్య

4 Jul, 2022 20:36 IST|Sakshi
బాలికల జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ కానున్న నార్తురాజుపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాల

 ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలలు

వాటిల్లో ఒకటి బాలికల కళాశాల

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 51 జెడ్పీ స్కూల్స్‌ల్లో ఇంటర్మీడియట్‌

వీటిల్లో 31 బాలికలు, 18 కో–ఎడ్యుకేషన్‌

ఈ ఏడాది నుంచి బాలికల   కళాశాలల్లో తరగతుల నిర్వహణ

సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు

బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు

పేద విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుంది. నూతన విద్యా విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది నుంచి జెడ్పీ హైస్కూ ల్‌లో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో ప్రతి మండలంలో  రెండు జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఒక జూనియర్‌ కళాశాల కేవలం బాలికలకు కేటాయించనున్నారు. ఇప్పటికే అన్ని వసతులు ఉన్న జెడ్పీ హైస్కూల్స్‌ను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. 

నెల్లూరు (టౌన్‌):  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నుంచి ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  మొత్తం 51 జెడ్పీ హైస్కూల్స్‌ల్లో ఇంటర్‌ విద్యను ఈ ఏడాది నుంచి ప్రవేశ పెట్టనున్నారు. వాటిల్లో ఒకటి బాలిక కళాశాల ఒకటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత కేజీబీవీ, మోడల్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేని ప్రాంతాల్లోని జెడ్పీ హైస్కూల్స్‌ను ఎంపిక చేశారు. వీటిల్లో 33 బాలికల, 18 కో–ఎడ్యుకేషన్‌ (బాలురు, బాలికలు) కళాశాలలుగా ఎంపిక చేశారు. అయితే వచ్చే ఏడాది నుంచి కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయనున్నారు.

ఆయా పాఠశాలల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్కడే ఇంటర్‌ చదివే విధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ప్రోత్సహించే పనిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు.  ప్రస్తుతం రెండు మండలాల్లో రెండేసి జూనియర్‌ కళాశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు మండలంలోని కోవూరు, ఇనమడుగు ప్రాంతాల్లోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మహిళల కోసం కేవలం డీకేడబ్ల్యూ జూనియర్‌ కళాశాల మాత్రమే ఉంది. ఇప్పటికే 6 కేజీబీవీల్లో బాలికలకు ఇంటర్‌ అందిస్తున్నారు. మరో 4 కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో పాటు 10 మోడల్స్‌ స్కూల్స్‌ల్లో  ఇంటర్‌ విద్యను అందిస్తున్నారు.  

ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు
జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న జూనియర్‌ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. ఒక్కో గ్రూపులో కనీసం 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. విద్యార్థుల ఎంపికలో రిజర్వేషన్, దారిద్య్రరేఖకు దిగువను ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇంటర్‌కు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 4వ తేదీ నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. ఈ కళాశాలలను ప్రారంభిస్తే పేద వర్గాలకు ఉన్నత విద్య మరింత అందుబాటులోకి రానుంది.  

అందరికీ అందుబాటులో ఇంటర్‌ విద్య 
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్య అందరికీ అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 33 హైస్కూల్స్‌ల్లో బాలికల జూనియర్‌ కళాశాలలను, మరో 18 ఉన్నత పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయబోతున్నాం. దీనిపై విధి విధానాలు వచ్చిన వెంటనే ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను ప్రారంభిస్తాం. 
– డీఈఓ రమేష్, డీవీఈఓ శ్రీనివాసులు   

మరిన్ని వార్తలు