జగనన్న విద్యా దీవెన: విద్యారంగంలో పెరిగిన చేరికల నిష్పత్తి

8 Aug, 2021 08:21 IST|Sakshi

జాతీయ స్థాయిలో విద్యార్థుల చేరికలు గతేడాది కన్నా 3 శాతం పెరుగుదల

ఏపీలో 8.6 శాతం పెరిగిన చేరికలు 

ఒక్క ఏడాదిలో విద్యార్థినుల చేరికలు 11 శాతం పెరుగుదల

ఎస్సీలు 7.5, ఎస్టీలు 9.6 శాతం పెరుగుదల 

జగనన్న విద్యా దీవెన,వసతి దీవెన పధకాల ఫలితం   

విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యారంగంలో చేరికల నిష్పత్తి గణనీయంగా పెరిగింది. గరిష్ట చేరికల నిష్పత్తి (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో)లో జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు రెట్టింపు స్థాయికి మించి ఉండటం గమనార్హం. ఏపీకి దరిదాపుల్లో కూడా ఇతర రాష్ట్రాలేవీ లేవు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జాతీయ ఉన్నత విద్య (ఏఐఎస్‌హెచ్‌ఈ) 2019 – 20 సర్వే గణాంకాలు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి

ఐదేళ్ల గణాంకాలు చూస్తే... 
ఏఐఎస్‌హెచ్‌ఈ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 18 – 23 ఏళ్ల వయసున్న ప్రతి వంద మందిలో 2015–16లో గరిష్ట చేరికల నిష్పత్తి 24.5 ఉండగా 2019–20 నాటికి 27.1కి చేరుకుంది. ఐదేళ్లలో చేరికలు 10.61 శాతానికి పెరిగాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో గణాంకాలు పరిశీలిస్తే 30.8 నుంచి నిష్పత్తి 35.2కి పెరిగింది. అంటే ఉన్నత విద్యనభ్యసించే వారు ఐదేళ్లలో 14.5 శాతం మేర పెరిగారు. చివరి రెండేళ్లలో ఉన్నత విద్యలో చేరికలను విశ్లేషిస్తే పెరుగుదల శాతం అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2018–19, 2019–20లలో జాతీయస్థాయిలో చేరికలు 3.04 శాతం కాగా ఏపీలో 8.6గా ఉన్నట్లు ఏఐఎస్‌హెచ్‌ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో 2016– 18 మధ్య ఉన్నత విద్యలో చేరికలు 4.85 శాతం తగ్గాయి.   

ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా.. 
ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల గణాంకాలను పరిశీలిస్తే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో 2018–19, 2019–20లలో పెరుగుదల 5 శాతం లోపే ఉండడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణలో చేరికల శాతం ఏకంగా మైనస్‌లోకి దిగజారింది. 2018–19, 2019–20 గణాంకాలు పరిశీలిస్తే తెలంగాణలో 1.6 శాతం మేర తగ్గుదల ఉంది.  

విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల... 
గత ఐదేళ్లుగా ఉన్నత విద్యారంగం గరిష్ట చేరికల్లో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో 2018–19లో విద్యార్థుల జీఈఆర్‌ 35.8 కాగా 2019–20లో 38.3గా నమోదైంది. అంతకు ముందు ఏడాది కన్నా 2019–20లో ఏడు శాతం మంది విద్యార్థులు అదనంగా ఉన్నత విద్యలో చేరినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక  ఏపీలో విద్యార్థినుల చేరికల నిష్పత్తి 2018–19లో 29.0 కాగా 2019–20లో 32.2గా ఉంది. రాష్ట్రంలో ఉన్నతవిద్యలో విద్యార్థినుల చేరికలు ఒక్క ఏడాదిలో 11.03 శాతానికి పెరగడం గమనార్హం. అదే జాతీయస్థాయి జీఈఆర్‌ గణాంకాలు చూస్తే విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల 2.28 శాతమే ఉంది. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో 2018–19, 2019–20లలో విద్యార్థుల చేరికలు 4 శాతం లోపు, విద్యార్థినుల చేరికలు 6 శాతం లోపే ఉన్నాయి.  

ఎస్సీ, ఎస్టీల్లోనూ గణనీయ పురోగతి.. 
ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లోనూ ఏపీలో గణనీయ పురోగతి ఉన్నట్లు ఏఐఎస్‌హెచ్‌ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018–19, 2019–20లలో చేరికల గణాంకాలు చూస్తే ఎస్సీలు 7.5 శాతం పెరగ్గా ఎస్టీల చేరికలు 9.5 శాతానికి పెరిగాయి. అదే జాతీయ స్థాయిలో గత రెండేళ్లలో ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం మాత్రమే పెరుగుదల ఉండడం గమనార్హం. ఇదే సమయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లో తగ్గుదల కనిపిస్తోంది. 

పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లో భరోసా..
’గత రెండేళ్లలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల చేరికల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలే దీనికి ప్రధాన కారణం. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తుండగా వసతి దీవెన కింద వసతి, భోజనం, ఇతర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు నేరుగా అందిస్తోంది. దీంతో పిల్లల చదువులపై తల్లిదండ్రులకు భరోసా నెలకొంది. ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యాకోర్సుల్లో చేరగలుగుతున్నారు. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల నిష్పత్తి 2024 నాటికి 70కి పెంచడంతోపాటు 2035 నాటికి 90కి చేర్చాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలమనే నమ్మకం ఉంది’ 

– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌    

మరిన్ని వార్తలు