వెంటనే విధులకు హాజరవ్వండి

22 Apr, 2022 04:07 IST|Sakshi

బోధనాస్పత్రుల్లో సెలవుల్లో ఉన్న వైద్యులకు ఉన్నతాధికారుల ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో సెలవులో ఉన్న వైద్యులు వెంటనే విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒకేచోట ఐదేళ్లకుపైగా పనిచేసిన వారిలో 30 మంది వైద్యులు, సిబ్బందిని ఇటీవల బదిలీ చేశారు. బదిలీ అయిన వైద్యుల్లో కొందరు తమకు కేటాయించిన స్థానాల్లో చేరకపోగా, చేరిన కొందరు సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో వీరితోపాటు పలు కారణాలతో కొద్ది నెలలుగా విధులకు హాజరవ్వని 40 మందికిపైగా వైద్యులు వెంటనే విధులకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. అనారోగ్య కారణాలను చూపి సెలవులో ఉన్న వైద్యులకు మంగళగిరి ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ఆరోగ్యం బాగున్నట్టు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.

వివరాలు పంపండి
వైద్య ఆరోగ్యశాఖ బలోపేతానికి అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో వేలసంఖ్యలో  వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీచేసింది. తద్వారా 900 వరకు పీజీ సీట్లు పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పీజీ సీట్ల సంఖ్య, క్యాడర్‌ స్ట్రెంత్, పీజీ సీట్ల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల వారీగా నివేదికలు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.

నేటి నుంచి కౌన్సెలింగ్‌
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్లకు 2021–22 ప్యానెల్‌ సంవత్సరానికిగాను ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించడానికి శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్‌లో వర్చువల్‌గా కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది. క్లినికల్, నాన్‌–క్లినికల్, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తోంది.  

మరిన్ని వార్తలు