చదువుకు బడ్జెట్‌ భరోసా

17 Mar, 2023 04:45 IST|Sakshi

2023–24 బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యధిక కేటాయింపులు

జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన నిధుల కింద మరో రూ.11,541 కోట్లు..

ప్రభుత్వ విద్యాసంస్థలకు, వాటిల్లోని పేద విద్యార్థులకు సర్కారు మరింత వెన్నుదన్ను

విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి అన్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ విశ్వాసం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందుకు తగ్గట్లుగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే 2023–24 ఆర్థిక సంవత్సరానికి కూడా గతంలో కన్నా అధిక నిధులను కేటాయించి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

ఇక గురు­వారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభు­త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సం­వ­త్స­రానికి రూ.32,921 కోట్లను కేటాయించింది. ఇందులో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను కేటాయించింది. పాఠశాల, ఉన్నత విద్యలకు కలిపి సాధారణ విద్య పద్దు కింద రూ.32,198.39 కోట్లు, సాంకేతిక, విద్య పద్దు కింద రూ.512.37 కోట్లుగా ఉంది. వీటితో పాటు నైపుణ్యాభివృద్ధికీ నిధులు కేటాయించింది.

మరోవైపు.. విద్యార్థులకు సంక్షేమ విభాగాల ద్వారా అందించే జగనన్న విద్యాదీవెన (రూ.2,841 కోట్లు), జగనన్న వసతి దీవెన (రూ.2,200 కోట్లు).. అమ్మఒడి (రూ.6,500 కోట్లు) పథకాల నిధులు రూ.11,541 కోట్లను కూడా కలుపు­కుంటే ఈ కేటాయింపులు మరింత పెరుగుతాయి.


ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేసి ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది.

కానీ, ప్రస్తుత సర్కారు ప్రభుత్వ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ అందుకు తగ్గట్లుగా నిధులూ కేటాయిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే కాకుండా అందులో చదువుకునే పేద విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు అమలు­చేయిస్తూ అండదండలు అందిస్తోంది.

అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక..
జగనన్న అమ్మఒడి కింద రానున్న ఏడాదిలో కూడా రూ.6,500 కోట్లను విద్యార్థుల తల్లులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జగనన్న గోరుముద్ద కింద రూ.1,164 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో అచ్చంగా అదనపు మెనూ కోసమే రూ.611.23 కోట్లను ప్రభుత్వం కేటాయించడం గమనార్హం.

ఇక జగనన్న విద్యాకానుక కింద రూ.560 కోట్లను ఖర్చు­చేయనుంది. పాఠశాలల్లో మౌలిక సదుపా­యాల కల్పన కోసం మనబడి నాడు–నేడు కార్యక్రమం కోసం రూ.3,500 కోట్లను అందించనుంది. ఇంటర్మీడియెట్‌ విద్యకు రూ.779.47 కోట్లు అందించనుంది.

మరిన్ని వార్తలు