రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు

25 Mar, 2023 03:47 IST|Sakshi

2021–22లో 18.47 శాతం జీఎస్‌డీపీ నమోదు

గత ఐదేళ్లలో ఇదే అత్యధికం

వ్యవసాయంలో 14.50 శాతం.. సేవా రంగంలో 18.91 శాతం..

పరిశ్రమల రంగంలో 25.58 % పెరుగుదల

2020–21లో తగ్గుదలకు కోవిడ్‌ మహమ్మారే కారణం

2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి : గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2021–22లో ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం మేర వృద్ధి సాధించినట్లు కాగ్‌ వెల్లడించింది.

గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా తెలిపింది. 2020–21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు తగ్గడానికి కోవిడ్‌ మహమ్మారివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, దేశ జీడీపీతో పోలిస్తే ఆ ఏడాది రాష్ట్రంలో జీఎస్‌డీపీ 5 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. అలాగే, ఆ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 1.36 శాతం క్షీణించిందని కాగ్‌ తెలిపింది. 

ఈ రంగాల్లో అత్యధిక వృద్ధి..
ఇక 2021–22 విషయానికొస్తే.. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో అత్యధిక వృద్ధి నమోదైనట్లు కాగ్‌ పేర్కొంది. 
♦ అంతకుముందు ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పారిశ్రామిక రంగంలో 25.58 శాతం వృద్ధిని సాధించినట్లు కాగ్‌ తెలిపింది. అలాగే..
♦  కోవిడ్‌ తర్వాత నిర్మాణ రంగం, తయారీ రంగం కోలుకున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగం 27%, తయారీ రంగం 25 శాతం పెరిగింది.
♦  వ్యవసాయ రంగంలో ప్రధానంగా చేపలు, ఆక్వాకల్చర్, పంటలు, పశు సంపద కార్యకలాపాలు పెరగడంతో వ్యవసాయ రంగం వృద్ధి సాధించింది.
♦  చేపల పెంపకం, ఆక్వాకల్చర్‌ 26%, పంట­లు, పశుసంపదలో 11 శాతం పెరుగుదల ఉం­ది.
♦ ప్రధానంగా వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 23 శాతం, రవాణా, నిల్వల, ప్రసార, సమాచార సేవలు 21 శాతం, స్థిరాస్తి రంగం 15 శాతం పెరగడంతో సేవలం రంగంలో భారీ వృద్ధి నమోదైంది.

మరిన్ని వార్తలు