ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను చూస్తే హంతక ముఠాకు ముచ్చెమటలు

26 May, 2021 11:49 IST|Sakshi
మున్నా, ఇతర నిందితులు (కుడి నుంచి ఎడమకు) ఫైల్‌

చిరుద్యోగులే అయినా ప్రలోభాలకు లొంగలేదు

చంపేందుకు యత్నించినా వెరవలేదు

ఉన్నతాధికారుల అండతో సాక్షుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

సాక్షి, ఒంగోలు: నేషనల్‌ హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు మున్నాతో సహా 18 మందికి సోమవారం ఒంగోలు 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి మనోహర్‌రెడ్డి శిక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు రావడం వెనుక కానిస్టేబుళ్లు వై.శ్రీనివాసరావు, బీఎస్‌ శ్రీనివాస్‌ కృషి ప్రశంసనీయం. మున్నా గ్యాంగ్‌కు శిక్ష పడిందని తెలియగానే బాధిత కుటుంబాలే కాదు.. ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైరైన అధికారులు, పలువురు న్యాయవాదులు శీను ద్వయాన్ని అభినందనలతో ముంచెత్తారు.

ఒంగోలుకు చెందిన వై.శ్రీనివాసరావు, బీఎస్‌ శ్రీనివాస్‌ 1993లో కానిస్టేబుళ్లుగా ఎంపికై తొలుత పొన్నలూరు పోలీసుస్టేషన్‌లో విధుల్లో చేరారు. 2008లో మున్నా కేసు వెలుగుచూసినపుడు వై.శ్రీనివాసులు అలియాస్‌ వాసు మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీ దర్యాప్తు చేయడం, మరో వైపు సింగరాయకొండ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాల్సి రావడంతో కానిస్టేబుల్‌ వాసును అప్పటి ఎస్పీ సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్‌ రాజు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వద్ద లైజన్‌ ఆఫీసర్‌గా నియమించారు. అతనికి తోడుగా బీఎస్‌ శ్రీనివాస్‌ను పంపారు. మున్నా గ్యాంగ్‌పై నమోదైన నాలుగు కేసుల్లో సాక్షులకు సమన్లు పంపడం, వారు తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడడం, వారి భద్రతకు ఉన్నతాధికారులతో భరోసా ఇప్పించడంలో ఇద్దరూ సఫలీకృతులయ్యారు.  

చదవండి: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు; 12 మందికి ఉరి శిక్ష

ఆఫర్లు.. బెదిరింపులు.. 
ఒంగోలు సబ్‌ జైల్లో ఉంటున్న మున్నా గ్యాంగ్‌తో సఖ్యంగా ఉంటూ అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేవారు. ఈ క్రమంలో ‘సాక్షులను తీసుకురావడం, వారికి నచ్చజెప్పడం మీకు అనవసరం. మీరు ఆ పని ఆపితే అర కోటి ఇస్తాం’ అంటూ మున్నాతోపాటు అతని బావమరిది హిదయతుల్లా అలియాస్‌ బాబులు ఆఫర్‌ చేయగా ఇద్దరూ తిరస్కరించారు. దీంతో వారిద్దరిపై మున్నా అనుచరులు ఆటోతో ఎటాక్‌ చేయగా తృటిలో తప్పించుకున్నారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌ఘర్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి బాధిత కుటుంబాలు సాక్ష్యం చెప్పేందుకు రప్పించడం, మృతదేహాలు లభించిన స్థలంలో చూసిన సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో వీరిద్దరూ కృషి చేశారు.

ఏదో ఒక విధంగా బెయిల్‌పై బయటకు రావాలని మున్నా గ్యాంగ్‌ కుటిల యత్నాలు చేయగా వాసు, శ్రీనివాస్‌ అడ్డుతగిలారు. దీంతో ఒక దశలో ‘మా మాట వింటే లక్షాధికారులు అవుతారు.. కాదంటే మీ అంతుచూస్తాం’ అని మున్నా గ్యాంగ్‌ హెచ్చరించినా వెరవలేదు. ఈ క్రమంలో అప్పటి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఏఆర్‌ సిబ్బందికి బాడీ వార్న్‌ కెమెరాలు అందించి నిఘా పెంచడంతో మున్నా గ్యాంగ్‌ ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం సైకిల్‌పై కోర్టుకు వెళ్లి వస్తున్న వాసుకు వెపన్‌ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించగా వాసు సున్నితంగా తిరస్కరించారు. దీంతో మాలకొండయ్య అనే మరో హెడ్‌ కానిస్టేబుల్‌ను భద్రత కోసం ప్రత్యేకంగా అప్పటి ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ నియమించారు. 

ఉన్నతాధికారుల అండదండలు 
మున్నా గ్యాంగ్‌ను కలిసేందుకు వచ్చే పాత నేరస్తులపై దృష్టి పెట్టడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో అప్పటి ఎస్పీ నవీన్‌చంద్‌ మొదలు ప్రస్తుత ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ వరకు లైజన్‌ ఆఫీసర్లను మార్చే ప్రయత్నం చేయలేదు. ఇదిలా ఉండగా కిల్లర్‌ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసిన సమయంలో ఉన్న పలువురు ఆఫీసర్లు రిటైరయ్యారు. మరికొందరు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. వీరందరికీ కేసుల స్థితిగతులను వివరించడంతోపాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు చేదోడువాదోడుగా ఉంటూ మున్నా గ్యాంగ్‌కు కఠిన శిక్ష పడేలా చేశారు. అందుకే అందరినీ హడలెత్తించిన మున్నా గ్యాంగ్‌కు వై.శ్రీనివాసరావు, బీఎస్‌ శ్రీనివాస్‌ పేరు వింటే ముచ్చెమటలు పట్టేవి.

మరిన్ని వార్తలు