విధితో గెలవలేక.. హిమపావని కన్నుమూత

29 Oct, 2022 12:50 IST|Sakshi

శస్త్ర చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన సీఎం జగన్‌

ఆపరేషన్‌ తర్వాత చికిత్స పొందుతూ మరణించిన బాలిక

సాక్షి, నంద్యాల(బొమ్మలసత్రం): పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె హిమపావని(10) విధితో పోరాడలేక గురువారం కన్నుమూసింది. హిమపావని ఐదు నెలల ముందు వరకు స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఆనందంగా ఉండేది. అటువంటి సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పావనికి మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా చేదునిజం బయటపడింది.

చిన్నారి మెదడులో రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. కొందరు దాతల సహకారంతో జూన్‌ నెలలో తమిళనాడులోని వేలూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నెల తర్వాత వైద్యులు తప్పని సరిగా పాపకు ఆపరేషన్‌ చేయాలని, అందుకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే అంత మొత్తం లేక  మిన్నకుండిపోయారు.

ఈనెల 17న ఆళ్లగడ్డకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినపుడు కలిసి పాప విషయాన్ని తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి పాప ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ రూ.లక్ష చెక్కును అందించి శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉన్న సిటీ న్యూరో సెంటర్‌లో ఈనెల 20న పావనిని చేర్పించారు.

26వ తేదీ వైద్యపరీక్షలు పూర్తి చేసి గురువారం ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ఆపరేషన్‌ పూర్తయిన గంట తర్వాత చిన్నారి హార్ట్‌బీట్‌ తగ్గిపోవడం గమనించిన వైద్యులు హుటాహుటీన అధునాతన పరికరాలతో వైద్యం అందించారు. అయినప్పటికీ పావని కోలుకోలేక కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పారవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

పాప కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాప మృతదేహాన్ని పట్టణంలోని వారి ఇంటికి చేర్చారు. మృతదేహం వద్ద ఎమ్మెల్యే సతీమణి శిల్పా నాగినిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, చైర్‌పర్సన్‌ మాబున్నిసా, వైస్‌ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటసుబ్బయ్య, అమృతరాజ్‌లు నివాళులు అర్పించారు. చిన్నారి అంత్యక్రియలకు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆర్థిక సహాయం అందించారు.   

>
మరిన్ని వార్తలు