‘పట్టు’న్న జిల్లా.. శ్రీసత్యసాయి

23 Apr, 2022 16:22 IST|Sakshi

జిల్లాకే తలమానికం హిందూపురం పట్టు, చింత మార్కెట్లు

జిల్లాతో పాటు కర్ణాటక రైతులకూ మార్కెటింగ్‌ సాయం

ఏటా రూ.కోట్లలో లావాదేవీలు

హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ ఆసియాలోనే పేరు గాంచింది. ఇక్కడి చింతపండు, మిర్చి యార్డ్‌ నుంచి దేశ  విదేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ రైతులు కూడా హిందూపురం మార్కెట్లకు   ఉత్పత్తులు తెచ్చి విక్రయించుకుంటున్నారు.   

హిందూపురం: పట్టు...చింతపండు విక్రయాలకు హిందూపురం మార్కెట్లు ఆసియాలోనే పేరుగాంచాయి. ఇక్కడి నుంచి పట్టుగూళ్లు, చింతపండు కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాలకే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మిగతా మార్కెట్‌లతో పోలిస్తే ధర ఎక్కువగా దక్కడం వల్ల అనంతపురం, కర్నూలు, నంద్యాల, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రైతులు ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చి విక్రయించుకుంటున్నారు. మార్కెట్‌ ఫీజుతో ప్రభుత్వానికి  కూడా ఆదాయం సమకూరుతోంది. 

‘పట్టు’న్న జిల్లా.. 
శ్రీసత్యసాయి జిల్లా మల్బరీ సాగులో అగ్రస్థానంలో ఉంది. అలాగే జిల్లాలోని  హిందూపురం, కదిరి, ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్లు పేరుగాంచాయి. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ ఆసియాలోనే పేరుగాంచింది. ఇక దేశంలోని పట్టుగూళ్ల మార్కెట్‌లలో కర్ణాటకలోని రామనగర్‌  తర్వాత స్థానం హిందూపురం మార్కెట్‌దే. జిల్లాలో ఏడాదికి 30 వేల మెట్రిక్‌ టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి అవుతాయి. ఒక్క హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌లోనే ఏటా వెయ్యి టన్నుల పట్టుగూళ్ల విక్రయాలు సాగుతాయి. ఈ మార్కెట్‌లో బైవోల్టిన్‌ రకం పట్టుగూళ్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఏడాది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కిలో బైవోల్టిన్‌ గూళ్లు గరిష్టంగా రూ.1,000పైనే పలికాయి.  

దేశ విదేశాలకు చింత ఎగుమతి..  
హిందూపురం చింతపండు, మిర్చి మార్కెట్‌       ఆసియాలోనే పెద్ద మార్కెట్లలో ఒకటి. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రైతులు చింతపండును ఎక్కువగా ఈ మార్కెట్‌కే తెస్తారు. అందువల్లే ఇక్కడ ఏటా రూ.కోట్లల్లో టర్నోవర్‌ జరుగుతోంది. అధికారికంగా ఏటా లక్ష క్వింటాళ్ల చింతపండు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అనధికారికంగా మరో 50 వేల   క్వింటాళ్ల వ్యాపారం జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి చింతపండును వ్యాపారులు విజయవాడ,   తమిళనాడులోని చెన్నై, సేలం, కోయంబత్తూర్‌ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ కంపెనీలు  వివిధ దేశాలకు ఎగుమతి చేస్తాయి.  

రైతులకు నమ్మకం 
హిందూపురం మార్కెట్‌యార్డు చింతపండు, మిర్చి క్రయవిక్రయాలకు పేరుగాంచింది. రైతులకు ఈ మార్కెట్‌పై నమ్మకం ఎక్కువ. గిట్టుబాటు ధర లభించడంతో పాటు లావాదేవీలు కచ్చితంగా ఉంటాయి. అందువల్లే ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడి తీసుకువచ్చి విక్రయించుకుంటారు. ఏడాదిలో ఆరునెలలు చింతపండు మార్కెట్‌ బాగా ఉంటుంది. మిర్చి మార్కెట్‌ నిరంతం సాగుతుంది.  
– నారాయణ మూర్తి, స్పెషల్‌గ్రేడ్‌ కార్యదర్శి, హిందూపురం మార్కెట్‌యార్డు

మోసం ఉండదు 
హిందూపురం మార్కెట్‌లో మోసం ఉండదు. అధికారులు, వ్యాపారులు నిక్కచ్చిగా ఉంటారు. అందుకే రైతులు చింతపండును ఎక్కువగా ఈ మార్కెట్‌కే తెస్తారు. ఈసారి ధర బాగానే ఉంది. నాణ్యమైన చింతపండు విదేశాలకు ఎగుమతి అవుతుంది కాబట్టి వ్యాపారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.  అందువల్లే రైతుకు  మంచి ధర లభిస్తోంది.
  – నాగప్ప, జూలకుంట. 

గిట్టుబాటు ధర  
హిందూపురం మార్కెట్‌పై రైతులకు ఎక్కువ గురి ఉంటుంది. మిగతా మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ గిట్టుబాటు ధర దక్కుతుంది. ప్రస్తుతం కిలో బైవోల్టిన్‌ గూళ్లు రూ.750 నుంచి రూ.900పైగా∙పలుకుతున్నాయి. గతంలో రూ.350 మించి పలికేవి కావు. అందుకే రైతులు హిందూపురం మార్కెట్‌కు          వచ్చేందుకు ఉత్సాహం చూపుతారు.  
– తిమ్మేగౌడ్, బక్తరహళ్లి, మడకశిర.  

మరిన్ని వార్తలు