కరోనాపై పోరులో దైవసంకల్పం కోసం.. 

24 May, 2021 04:19 IST|Sakshi

ప్రముఖ ఆలయాలన్నింటిలో దేవదాయ శాఖ హోమాలు, యాగాలు

నేడు సింహాచలంలో ధన్వంతరి, సుదర్శన, స్వాతి హోమాలు  

శ్రీశైలంలో 21 రోజుల పాటు మహా మృత్యుంజయ మంత్ర పారాయణం

విజయవాడ దుర్గ గుడిలో ఇప్పటికే చండీయాగం పూర్తి

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు దైవ సంకల్పం తోడుగా ఉండాలని దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో హోమాలు, యాగాలు నిర్వహిస్తోంది. ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ధన్వంతరి హోమం, సుదర్శన హోమం, స్వాతి హోమాలు నిర్వహించనున్నారు. 24న వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ హోమాలలో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. 

► కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయంలో ఆదివారం మహా మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహించారు. దీనికి తోడు ఆదివారం మొదలు వరుసగా 21 రోజుల పాటు రోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్య మహా మృత్యుంజయ మంత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. 
► అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇప్పటికే దేవదాయ శాఖ ప్రత్యేక ఆయుష్‌ హోమాన్ని నిర్వహించగా, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సర్వశాంతి హోమాన్ని నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో శుక్రవారమే చండీ హోమం, శ్రీచక్ర నవ వర్ణార్చన పూజలు చేయగా.. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమాలనూ పూర్తి చేశారు. 

నెల రోజులుగా కొనసాగుతున్నాయి..  
కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి పెరిగిన నాటి నుంచి గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆలయాల్లో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు రోజువారీగా జరుగుతున్నాయి. భక్తులు ఇంటి వద్ద నుంచే తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 79 ఆలయాల్లో పరోక్ష సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇలా ఇప్పటి వరకు రూ.76.12 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయాల్లో పరోక్ష సేవల పురోగతిపై ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వారంలో రెండు రోజులు సమీక్షిస్తున్నాను. 
– వాణీమోహన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి  

తిరుమలలో హస్తా నక్షత్రేష్టి 
తిరుమల: కరోనా మహమ్మారి నుంచి రక్షించి సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో హస్తా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు. పీఠం ప్రిన్సిపాల్‌ కేఎస్‌ఎస్‌ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరిగిన ఈ మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు. కాగా, మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్‌ 15వ తేదీ వరకు జరగనుంది. కృత్తిక నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్‌ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఈ 28 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు.  

మరిన్ని వార్తలు