అమరావతిలో అందరికీ ఆవాసం

31 Oct, 2022 05:09 IST|Sakshi

900.97 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం

మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో ఐదు గ్రామాలు ఎంపిక.. సామాన్యుడి కోసం సీఆర్‌డీఏ చట్ట సవరణ

మాస్టర్‌ ప్లాన్‌ మార్పుతో ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు

విపక్షాలు విషం చిమ్మినా పేదల పక్షానే ప్రభుత్వం

సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్‌–5 జోన్‌గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్‌ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి.

చట్ట ప్రకారమే 5 శాతం 
సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్‌–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్‌ ప్లాన్‌ లేదా జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్‌లో పొందుపరిచింది.

పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’
నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. 

సీఎం జగన్‌ పేదల పక్షపాతి 
పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే.
– రేటూరి కిషోర్, సీనియర్‌ న్యాయవాది (మంగళగిరి)

సామాజిక న్యాయం అంటే ఇదీ.. 
రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్‌ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ.
– మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి

అన్ని వర్గాలుండాలి 
ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు మంచి నిర్ణయం. 
– వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) 

గొప్ప విషయం..
అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్‌ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. 
– రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం

సముచిత నిర్ణయం
పేదల కోసం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. 
– ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కాకినాడ

పేదల పక్షపాతి
అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. 
– కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌(రాయదుర్గం)

హర్షిస్తున్నాం..
అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్‌డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్‌ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. 
– చింతా కృష్ణయ్య, సీనియర్‌ న్యాయవాది, ధర్మవరం

తప్పిదాన్ని సరిదిద్దారు..
రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్‌ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. 
– మాదిగాని గురునాథం, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు)

సామాజిక సమత్యులత సాకారం
అమరావతిలో టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే సీఎం జగన్‌ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది.
–– పోలూరి వెంకటరెడ్డి,  బార్‌ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు

అణగారిన వర్గాలకు పెద్దపీట..
అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను  లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి.
––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది)

మరిన్ని వార్తలు