ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్

25 Sep, 2020 08:30 IST|Sakshi

ముఖ్య అతిథిగా హోంమంత్రి సుచరిత 

గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 

పోలీస్‌.. ఈ పదమే వారిని యూనిఫాం వైపు నడిపించింది. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం..  అందరి కల ఒక్కటే. ఖాకీ యూనిఫాం వేసుకుని చట్టాన్ని రక్షించడం. సామాన్యులకు న్యాయం చేయడం. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు. శిక్షణ సైతం పూర్తి చేసుకున్నారు. చివరగా ప్రజా సేవకు  సిద్ధమవుతున్నారు. పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ట్రైనీ ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శుక్రవారం నిర్వహించారు.

సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీసు ట్రైనింగ్‌ కళాశాల మరో అపురూప ఘట్టానికి వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 మంది స్టైఫండరీ కేడెట్‌ ట్రైనీ ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో ఉదయం 7.40 గంటలకు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం హోంమంత్రి, డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్ రెడ్డి, శమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకట్రామిరెడ్డి, క్రాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు.

కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం జగన్‌దే. దిశా బిల్లు తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష పడేలా చేశారు. ఏపీలోని అన్ని పోలీసు స్టేషన్లను ఉమెన్ ఫ్రెండ్లీ గా మార్చేశాం' అని అన్నారు.

ప్రతిభావంతులకు పురస్కారాలు 
అనంతపురం పోలీసు ట్రైనింగ్‌ కళాశాలలో దాదాపు సంవత్సరం పాటు శిక్షణ పొందిన 138 మంది సివిల్‌ ఎస్‌ఐలు, 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 69 మంది ఏఆర్, 66 మంది ఏపీఎస్‌పీ ఎస్‌ఐలు పరేడ్‌లో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత పురస్కారాలను అందజేశారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. 

డీజీపీ సమావేశం 
డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉదయం 11.30 నుంచి 12 గంటల సమయంలో డీపీఓలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. జిల్లా పోలీసుల పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం చిత్తూరు, వైస్సార్‌ కడప జిల్లా పోలీ సులకు రివార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  

 
హోంమంత్రికి ఘన స్వాగతం 
సాక్షి, అనంతపురం‌: ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్‌ వేర్వేరుగా గురువారం రాత్రే నగరానికి చేరుకున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద హోంమంత్రికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ నిశాంత్‌కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల భానుమతి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు కూడా హోంమంత్రికి  బొకేలిచ్చి స్వాగతం పలికారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు