పేదల స్థలాల్లో పెద్దలు

22 Sep, 2020 10:36 IST|Sakshi
టీడీపీ నాయకులు పట్టాలు పొందిన రాచానపల్లి సర్వే నంబర్‌ 4–2

అనర్హులకు ఇంటి పట్టాలు 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ్ముళ్ల నిర్వాకం

పేదలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు

అనంతపురం రూరల్‌: ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే నివేశన స్థలాలపై పెద్దలు కన్నేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇంటి పట్టాలు చేయించుకున్నారు. అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి సర్వే నంబర్‌ 4 – 2లో 2018లో దాదాపు 110 మందికి అప్పటి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఆ పట్టాలు పొందిన వారిలో 80 శాతం మందికి సిండికేట్‌నగర్, రాచానపల్లి తదితర ప్రాంతాల్లో సొంత భవనాలతో పాటు పంట పొలాలు ఉన్నాయి. జానెడు జాగా లేని తమను పక్కనపెట్టి ఆర్థికంగా ఉన్న వారికి ఇంటి పట్టాలు మంజూరు చేశారని ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరించారని పేదలు ఆరోపించారు. అర్హులైన పేదలు తమకు ఇంటి స్థలం ఇవ్వండని అర్జీలు ఇచ్చినా, అధికారులను కలిసినా కనికరించలేదని వాపోతున్నారు.  

పట్టాలు ఎంచక్కా అమ్ముకున్నారు! 
అనంతపురం రూరల్‌ మండల టీడీపీ నాయకుడిగా చెలామణి అయిన ఓ నాయకుడుతో పాటు రాచానపల్లికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, మాజీ స్టోర్‌ డీలర్లు, గతంలో ఇక్కడ పని చేసిన రెవెన్యూ అధికారులు కుమ్మకై దాదాపు 70 ఇంటి పట్టాల వరకు అనర్హులకు కట్టబెట్టారు. దీంతో పట్టాలు పొందిన వారు ఒక్కో పట్టాను దాదాపు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. 

వారి పట్టాలు రద్దు చేయాలి 
రాచానపల్లి సర్వే నంబర్‌ 4– 2లో జారీ చేసిన ఇంటి పట్టాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పట్టాలు అమ్ముకున్న వారిని గుర్తించి, వాటిని రద్దు చేసి చర్యలు తీసుకుంటే అసలై­న నిరుపేదలక న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. గతంలో  రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని మండిపడుతన్నారు.

ఈ చిత్రాల్లో కనిపిస్తున్న భవంతులు టీడీపీ నాయకులకు చెందినవి. ఇక్కడ సెంటు స్థలం రూ.15 లక్షల పైమాటే. ఒక్కో టీడీపీ నాయకుడు దాదాపు 5 సెంట్లలో భవంతులు నిర్మించుకున్నారు. ఇలాంటి వారు సైతం అప్పట్లో అధికార బలంతో వారి కుటుంబ సభ్యుల పేర్లు, బినామీ వ్యక్తుల మీద ఒక్కొక్కరు రెండు, మూడు చొప్పున ఇంటి పట్టాలు పొందారు. సిండికేట్‌నగర్‌ మెయిన్‌ రోడ్డులో నిర్మించిన టీడీపీ నాయకుల భవంతులు 

విచారణ చేస్తాం..
అనర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని మాకు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది ఇతరులకు అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. ఇదే విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయాం. క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. 
– లక్ష్మినారాయణరెడ్డి, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్, అనంతపురం 

>
మరిన్ని వార్తలు