బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం..

2 Nov, 2020 12:57 IST|Sakshi

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల సన్మాన కార్యక్రమంలో మంత్రులు

సాక్షి, విజయవాడ: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం కృష్ణా జిల్లాలోని నలుగురు బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, 34 మంది డైరెక్టర్లకు తమ్మలపల్లి కళాక్షేత్రంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారధి, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, దూలం నాగేశ్వరరావు, జగన్‌మోహన్‌రావు, కైలే అనీల్, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, నేతలు బొప్పన భవకుమార్,దేవినేని అవినాష్, పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు. (చదవండి: జగన్‌ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు)

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ‘‘బీసీలకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పార్టీని లాక్కొని బీసీలను ఓటు బ్యాంకుగా మార్చేశారు. బీసీలకు ఎన్టీఆర్ లేని లోటును దివంగత మహానేత వైఎస్సార్‌ తీర్చారు. ఐదేళ్ల పాలనలో అందరి హృదయాల్లో చెరగని ముద్రలా నిలిచారు. తండ్రి లేని లోటుని తనయుడు వైఎస్ జగన్ తీరుస్తున్నారు. బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. చైర్మన్లు, డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని’’ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్‌)

అన్ని రంగాల్లో బీసీలకు పెద్దపీట: పెద్దిరెడ్డి
బీసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించాం.బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థతో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

బీసీల అభ్యున్నతికి బాటలు: మోపిదేవి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ‘‘ కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన పదవులను సీఎం జగన్ విస్తృత పరిచారు. చిన్న చిన్న కులాల నుంచి కూడా ప్రతినిధులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేయాలి. బీసీల జీవితాల్లో సీఎం జగన్ వెలిగించిన చిరుజ్యోతి మహోజ్వల జ్యోతిగా మారుతుందని’’ మోపిదేవి పేర్కొన్నారు.

బలహీన వర్గాల్లో విప్లవాత్మక మార్పులు: పార్థసారధి
బలహీన వర్గాల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టాయన్నారు. 70 శాతం ఉన్న వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెట్టారని తెలిపారు. ఇంటికో ఇంజనీర్‌ ఉన్నాడంటే అది వైఎస్సార్‌ చలువేనన్నారు. ఇప్పుడు అదే తరహాలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలు గురించి ఆలోచించారని, బీసీ కులాల సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి నివేదికలు తెప్పించుకున్నారన్నారు. బీసీ గర్జనలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చారని తెలిపారు. సమస్యలు చెప్పేందుకు వెళ్తే బలహీనవర్గాల వారిని తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తానన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కార్పొరేషన్‌ ఛైర్మన్‌, డైరెక్టర్లలో యాభై శాతం మహిళలకే కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌కు బీసీలు, మహిళలు రుణపడి ఉండాలని పార్థసారధి అన్నారు.

బాధ్యతాయుతంగా పనిచేయాలి: మల్లాది విష్ణు
బడుగు,బలహీన వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసీ నేత మోపిదేవి వెంకటరమణకు ఇస్తున్న ప్రాధాన్యతే అందుకు నిదర్శనమని చెప్పారు.  కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని విష్ణు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అని చాటి చెప్పిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు.


చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి: జోగి రమేష్‌
బీసీలలో 2019 ఎన్నికల్లోనే చైతన్యం రగిలిందని ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీసీల దమ్మెంతో చూపిస్తాం. ‘‘139 కులాలు బీసీలో ఉన్నాయని గుర్తించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్.  పాదయాత్రలో చెప్పిన విధంగా బీసీల అభ్యున్నతికి బాటలు వేశారు. అసెంబ్లీ మొదటి సెషన్‌లోనే బీసీలకు 50 శాతం అవకాశాలకు చట్టం తెచ్చారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన  వైఎస్సార్ కాంగ్రెస్ బాటలో అడుగులు వేద్దామని’’ ఆయన పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో బీసీలకు చట్టసభల్లో కూడా అవకాశాలు పెరుగుతాయన్నారు. బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని జోగి రమేష్‌ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు