విశాఖలో ఇక గుర్రం స్వారీ

12 Nov, 2022 11:02 IST|Sakshi

రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్స్‌లో శిక్షణకు ఏర్పాట్లు  

రైల్వే ఉద్యోగులతో పాటు, సామాన్యులకూ శిక్షణ 

నెల నుంచి 2 నెలల పాటు తర్ఫీదు

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖ నగర వాసులకు ఇక ఎంచక్కా గుర్రపు స్వారీ చేసే అవకాశం వచ్చింది. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌.. వాల్తేర్‌ ఆధ్వర్యంలో వాల్తేర్‌ రైల్వే ఫుట్‌ బాల్‌ స్టేడియం(పాత ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌)లో హార్స్‌ రైడింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశ రైల్వే స్పోర్ట్స్‌ చరిత్రలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిగా తామే అందుబాటులోకి తెచ్చినట్టు వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి తెలిపారు.

వాల్తేర్‌ డివిజన్‌ ఇప్పటికే స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్‌ వంటి పలు ప్రత్యేక క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ఇప్పుడు హార్స్‌ రైడింగ్‌ కూడా తోడవడంతో రైల్వే ఉద్యోగులు, నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు గుర్రపు స్వారీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కల నెరవేరింది. రైల్వే ఉద్యోగులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు నగరవాసులు కూడా రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 98124 89786, 98485 92625 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్టు తేజ్‌ హార్స్‌ రైడింగ్‌ స్కూల్‌ నిర్వాహకుడు షరీఫ్‌ చెప్పారు. సాధారణంగా పదేళ్ల వయస్సు నుంచి ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవచ్చని,  ఆసక్తి, ఆరోగ్యవంతులైన పిల్లలైతే ఆరేళ్ల నుంచే శిక్షణ తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఇక్కడ 8 గుర్రాలను శిక్షణ కోసం సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజూ అరగంట పాటు శిక్షణ ఉంటుందని కోచ్‌ అబ్బాస్‌ చెప్పారు.

ఇదీ చదవండి: సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి: వైజాగ్‌ బహిరంగ సభలో సీఎం జగన్‌

మరిన్ని వార్తలు