Horsley Hills: అదిరేటి అందం.. ఆంధ్ర ఊటీ సొంతం

23 Aug, 2022 17:14 IST|Sakshi

ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్‌కు 153 ఏళ్లు 

వేసవి విడిది కేంద్రంగా చేస్తూ 1869లో మద్రాసు ప్రభుత్వం జీఓ జారీ  

అతిథి గృహ నిర్మాణానికి ఇంగ్లాండు నుంచి ప్రత్యేకంగా పెంకులు  

4,141 అడుగుల ఎత్తులో నీటికోసం బావి నిర్మాణం 

సాక్షి, బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ వేసవి విడిది కేంద్రంగా ఎలా మారింది, దీని వెనుక చరిత్ర ఏమి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరచే ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులవుతారు. చిరుజల్లులు కురిస్తే ఆ ప్రకృతి అందానికి మైమరచే ప్రకృతి ప్రేమికులెందరో. అలాంటి అందమైన హార్సిలీహిల్స్‌ను 153 ఏళ్ల క్రితమే బ్రిటీష్‌ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత బ్రిటిష్‌ కలెక్టర్‌ హార్సిలీ కొండపై చేపట్టిన పనులు, దాని చరిత్ర ఆనవాళ్లు ఇప్పటికి కళ్లముందు కనిపిస్తున్నాయి.   

సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్‌పై దీన్ని కనుగొన్న డబ్ల్యూడీ హార్సిలీ చెరగని ముద్రవేశారు. డబ్ల్యూడీ హార్సిలీ తొలుత మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై కడప కలెక్టర్‌ అయ్యాక గుర్రంపై కొండకు రాకపోకలు సాగించారు. మద్రాసు ప్రభుత్వ అనుమతితో వేసవి విడది కేంద్రంగా మార్చారు. తొలి అతిథి గృహ నిర్మాణం కోసం అనుమతి పొంది వాటికి కావాల్సిన పెంకులను ఓడ ద్వారా ఇంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని కొండకు తరలించుకొన్నారు. ఒకప్పటి దట్టమైన అడవితో నిండిన హార్సిలీహిల్స్‌పై భూమి అంతా అటవీశాఖదే. వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు దక్కిన 90 ఏళ్ల తర్వాత అంటే 1959లో అటవీశాఖ 103 ఎకరాలను రెవెన్యూశాఖకు బదలాయించింది. లేదంటే ఈ రోజుకు హార్సిలీహిల్స్‌ మొత్తం నిషేధిత రిజర్వ్‌ఫారెస్ట్‌ పరిధిలో ఉండేది.


 
అతిథి గృహానికి ఇంగ్లాండ్‌ పెంకులు   
వేసవి విడిది కేంద్రంగా హార్సిలీహిల్స్‌కు బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు అతిథిగృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ హార్సిలీ మద్రాసు ప్రభుత్వానికి లేఖ రాయగా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్‌9న జీఓఎంఎస్‌ నంబర్‌ 4162ను జారీచేసింది. దీంతో 1869లోనే తొలి అతిథి గృహ నిర్మాణం మొదలైంది. హార్సిలీ ఇంగ్లాండ్‌ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండకు రవాణా చేయించుకున్నారు. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథిగృహంగా పిలుచుకునే గది పైకప్పుకు ఈ పెంకులు వాడారు. ఇంగ్లాండ్‌లో 1865లో బేస్డ్‌ మిషన్‌ టైల్‌ వర్క్స్‌ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు పెంకులపై అక్షరాలు, కంపెనీ వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నేళ్లకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేసింది కూడా బ్రిటిష్‌ ప్రభుత్వంలోనే.  

4,141 అడుగుల ఎత్తులో బావి   
హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా మార్చుకోవడం, అతిథిగృహం నిర్మించుకొన్న కలెక్టర్‌ హార్సిలీకి నీటికోసం ప్రస్తుత అటవీ ప్రాంగణంలో బావిని తవ్వించగా పుష్కలంగా నీళ్లు లభ్యమయ్యాయి. బావి చుట్టూ ఇటుకల్లా బండరాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం అప్పట్లో అద్భుతంగా చెప్పబడుతోంది. బావి నిర్మాణంలో నేటికి ఒక్క రాయి కూడా చెక్కుచెదరలేదు. నీళ్లు నిండుగా ఉంటాయి. కరువు పరిస్థితుల్లో బావి ఎండినా సాధారణ రోజుల్లో నీళ్లుంటాయి.   

1869 నుంచి వేసవి విడిది కేంద్రం   
హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిది కేంద్రంగా చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ కడప కలెక్టర్‌ హార్సిలీ లేఖ పంపారు. ఈ లేఖపై బ్రిటీష్‌ మద్రాసు ప్రభుత్వం హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా ప్రకటిస్తూ 1869 మే4న జీఓఎంఎస్‌ నంబర్‌ 11579ను జారీచేసింది. అప్పటినుంచి 153 ఏళ్లుగా వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు కూడా అధికారికంగా ఇది వేసవి విడిది కేంద్రంగా గుర్తించారు. పలువురు గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు.  

ఒకేరోజు జననం, మరణం 
హార్సిలీహిల్స్‌పై మక్కువ పెంచుకొన్న కలెక్టర్‌ హార్సిలీ నిండుగర్భిణి అయిన సతీమణీతో కొండపై విడిది చేశారు. 1864 మే 31న ప్రసవం జరిగి కుమారుడు జన్మించగా అదేరోజు చనిపోయాడు. ఈ పసిబిడ్డకు జార్జ్‌హార్సిలీ అని నామకరణం చేసి కొండపై (టూరిజం ముఖద్వారం వద్ద) ఖననం చేశారు. హార్సిలీకి ఇష్టమైన విడిదిచోటనే బిడ్డ పుట్టడం, ఆ ఆనందం అదేరోజు ఆవిరి కావడం బాధాకరం.

90 ఏళ్లకు డీ రిజర్వ్‌ ఫారెస్ట్‌  
హార్సిలీహిల్స్‌పై రెవెన్యూ, ఇతర శాఖలకు అడుగుపెట్టేందుకు చోటులేదు. 1869లోనే వేసవి విడిది కేంద్రంగా ప్రకటించినప్పటికి అటవీశాఖకు తప్ప ఎవరికి ప్రవేశంలేని పరిస్థితి. బ్రిటీష్‌ పాలన అంతమైనా మార్పులేదు. వేసవి విడిది కేంద్రంగా మారిన 90 ఏళ్ల తర్వాత 1959 ఏప్రిల్‌ 15న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 101523/సీ1/58–5 మెమో జారీ చేసింది. ఈ మెమో ద్వారా కోటావూరు రెవెన్యూ గ్రామం పరిధిలోని హార్సిలీహిల్స్‌పై సర్వేనంబర్‌ 538లోని 103 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌ను డీ రిజర్వ్‌ఫారెస్ట్‌గా మార్పుచేసింది. ఈ 103 ఎకరాలను రెవెన్యూశాఖ 1959 జూలై 25న స్వాధీనం చేసుకొంది.    

మరిన్ని వార్తలు