ఉద్యాన పంటలకు ఊతం

15 Apr, 2021 03:30 IST|Sakshi
చిత్తూరులో పాలీ హౌస్‌ కింద సాగవుతున్న పాదులు

సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకంతో మారుతున్న పంటల రూపురేఖలు 

రెండేళ్లలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన 

సాగు విస్తరణ, కొత్త పంటల సాగుకు అవకాశం 

నష్ట నివారణతో పాటు ఎగుమతులు పెరిగేందుకు దోహదం

సాక్షి, అమరావతి: ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిస్తుండటంతో వాటి రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌–ఎంఐడీహెచ్‌) కింద ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తోంది. దీంతో ఉద్యాన రైతులు ఉత్పత్తి నష్టాలను తగ్గించుకుంటుండగా.. మరోవైపు సాగు విస్తీర్ణం, ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.  

9 జిల్లాల్లో అమలు 
రాష్ట్రంలో 17.84 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 3.12 లక్షల టన్నుల దిగుబడులొస్తున్నాయి. గతంలో పంటను మార్కెట్‌కు తరలించేందుకు, డిమాండ్‌ ఉన్నచోట గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడేవారు. గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా వంటి సౌకర్యాల లేకపోవడం వల్ల ఉత్పత్తిలో 30 శాతం మేర నష్టపోయేవారు. ఆశించిన స్థాయిలో ఎగుమతులు చేయలేని పరిస్థితి తలెత్తేది. సర్కారు పుణ్యమా అని ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్‌) విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో అమలవుతోంది. గడచిన రెండేళ్లలో 9 జిల్లాల్లోనూ రూ.290.30 కోట్లతో ఈ పథకం కింద కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల 31,700 హెక్టార్లు కొత్తగా సాగులోకి వచ్చాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పథకం కింద పాత తోటల పునరుద్ధరణ, రక్షిత సేద్యం (గ్రీన్, పాలీ హౌస్‌) మల్చింగ్, నీటికుంటలు, ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్, కోల్డ్‌ స్టోరేజ్, రైపనింగ్‌ చాంబర్లు, ఉల్లి గిడ్డంగులు, యాంత్రీకరణ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.  
గుంటూరు జిల్లాలో కాపుకొచ్చిన డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట 

నీటి కుంటలతో చీనీ తోటలకు రక్షణ 
బత్తాయి (చీనీ) పంటకు చాలినంత నీటి వనరుల్లేక తోటలు ఎండిపోవడం లేదా నిర్జీవంగా తయారయ్యేవి. ఎంఐడీహెచ్‌ పథకం కింద పెద్దఎత్తున నీటి కుంటలు (ఫారమ్‌ పాండ్స్‌) నిరి్మంచడంతో గడచిన రెండేళ్లుగా చీనీ తోటలు వేసవిలో కూడా కళకళలాడుతున్నాయి. 2019–20లో 435 నీటికుంటల నిర్మాణంతో 3,067 హెక్టార్లు, 2020–21లో 460 నీటికుంటల నిర్మాణంతో 3,250 హెక్టార్లలో తోటలను ఎండిపోకుండా కాపాడగలిగారు. తద్వారా 467 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి పెరిగి రైతులు రూ.1.22 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలిగారు.  

అరటి ఎగుమతులకు ఊపు 
ఈ పథకం ద్వారా అరటి, మిరప సాగుతోపాటు వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు చేపట్టిన బనానా, చిల్లీ వేల్యూ చైన్‌ ప్రాజెక్టులు సత్ఫలితాలిస్తున్నాయి. అరటిలో టిష్యూ కల్చర్‌తో పాటు ఫ్రూట్‌కేర్‌ విధానాల వల్ల సాగు విస్తీర్ణంతో పాటు నాణ్యత కూడా పెరిగింది. దీంతో 1,750 హెక్టార్లలో కొత్తగా అరటి సాగులోకి వచ్చింది. అనంతపురంలో రెండు ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌లు, పులివెందులలో రెండు కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మించడంతో ఈ ప్రాంతం నుంచి ఏటా 10 వేల టన్నులకు మించని అరటి ఎగుమతులు ఇప్పుడు 1.50 లక్షల టన్నులకు పెరిగాయి. మిరప విషయానికి వస్తే రెండేళ్లలో 38,844 ఎకరాల్లో కొత్తగా సాగు మొదలైంది. తద్వారా ఉత్పాదకతలో 15 శాతం, ఉత్పత్తిలో 8 శాతం వృద్ధి సాధించగలిగారు. 

ఉత్పత్తి, నాణ్యతకు బూస్ట్‌ 
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వల్ల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత నాణ్యత, ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అంతర పంటల సాగు ద్వారా రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించగలుగుతున్నారు. 2019–20లో ఈ పథకం కింద రూ.132 కోట్లు ఖర్చు చేయగా.. కొత్తగా 15,200 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. 2020–21లో రూ.158.30 కోట్లను వెచ్చించగా.. కొత్తగా మరో 16,500 హెక్టార్లు కలిపి రెండేళ్లలో మొత్తంగా 31,700 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. దీనివల్ల 2019–20లో 52,500 మంది రైతులు, 2020–21లో 58,270 మంది రైతులు లబ్ధి పొందారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్లు వెచ్చించి.. కొత్తగా 18,500 హెక్టార్లు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. తద్వారా 75వేల మంది లబ్ధి పొందే అవకాశాలున్నాయని అంచనా.  

మరిన్ని వార్తలు