'పంట తల్లీ'.. ఎలా ఉన్నావ్‌!

27 Apr, 2021 05:07 IST|Sakshi
ఆర్‌బీకేలో రైతుల సమస్యలు వింటున్న వీసీ జానకిరామ్‌

వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పంటల యోగక్షేమాలను ఆరా తీస్తున్న ఉద్యాన శాస్త్రవేత్తలు

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు శాస్త్ర, సాంకేతిక సలహాలు

42 గ్రామాల్ని దత్తత తీసుకున్న వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్, శాస్త్రవేత్తలు పల్లెబాట పట్టారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను వేదికగా చేసుకుని ఉద్యాన రైతులతో మమేకమవుతున్నారు. ప్రయోగ శాలల్లో చేసిన పరిశోధనల ఫలితాలను సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా సాగులో సత్ఫలితాలను సాధించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ‘మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం’ కార్యక్రమానికి ఉద్యాన వర్సిటీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యాన అధికారులతో కలిసి వారంలో ఒకరోజు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పంటల యోగక్షేమాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. 

వీసీ టు విలేజ్‌
మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం కార్యక్రమానికే పరిమితం కాకుండా వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరామ్‌ సైతం ‘వీసీ టు విలేజ్‌’ పేరిట పల్లెబాట నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నారు. రైతులకు మేలు జరగాలంటే ఏ తరహా పరిశోధనలు, ఏ స్థాయిలో చేయాలనే అంశంపై శాస్త్రవేత్తలకు సైతం ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలుగుతోంది. గడచిన ఏడు నెలల్లో 22 గ్రామాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించారు.

42 గ్రామాలను దత్తత తీసుకున్న వర్శిటీ
ఉద్యాన వర్సిటీకి అనుబంధంగా 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 19 ఉద్యాన పరిశోధనా కేంద్రాలు, 4 ఉద్యాన, 4 పాలిటెక్నిక్, 11 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 42 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఉద్యాన పంటల సాగులో యూనివర్సిటీ కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా వ్యవసాయ, ఉద్యాన సహాయకుల సహకారంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త రకం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే దిశగా సహకారం అందిస్తున్నారు. కావాల్సిన విత్తనాలను సమకూర్చడంతో పాటు సాగులో అవసరమైన మెళకువలపైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత గ్రామాల రైతులతో ప్రతి బుధవారం యూనివర్సిటీ నుంచే వెబినార్‌ ద్వారా సమావేశమవుతూ సూచనలు, సలహాలు అందిస్తున్నారు.

రైతులకు మరింత మేలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల మేరకు పల్లెబాట పట్టాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న వీసీ టు విలేజ్, మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వారానికో గ్రామాన్ని సందర్శిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలెన్నో మా దృష్టికి వస్తున్నాయి. దీనివల్ల మరింత లోతైన పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతోంది.
– డాక్టర్‌ టి.జానకిరామ్, వీసీ, ఉద్యాన వర్సిటీ

చాలా ప్రయోజనకరంగా ఉంది
మన ఊరు–మన విశ్వవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా మా గ్రామాన్ని గతేడాది గాంధీ జయంతి రోజున కేవీకే శాస్త్రవేత్తలు దత్తత తీసుకున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయం, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. జీడిమామిడి రైతులను పందిరి మామిడి పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లి జీడిమామిడి పిక్కల ప్రొసెసింగ్‌ ఎలా చేయాలో వివరించారు. తాటికల్లుతో బెల్లం ఎలా తయారు చేయాలో చెప్పారు. కూరగాయ, పెరటి తోటల విత్తనాలు ఇచ్చారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది
– కోతం మోహనరావు, పండుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా 

మరిన్ని వార్తలు