‘క్వార్టర్‌ మందైనా, డబ్బులైనా ఇవ్వాలి’ రోగి బంధువులపై వైద్య సిబ్బంది చిందులు

19 Mar, 2022 10:39 IST|Sakshi

 సాక్షి. విశాఖపట్నం: అప్పుడే 72 ఏళ్ల వృద్ధుడికి శస్త్రచికిత్స అయింది. 50–50 చాన్స్‌తో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోగి బంధువులు తీవ్ర వేదనలో ఉన్నారు. వీరి బాధలు అక్కడ (శస్త్రచికిత్స గది) వార్డు బాయ్‌కు పట్టడం లేదు. వార్డుకు షిఫ్ట్‌ చేయాలి. క్వార్టర్‌ బాటిల్‌ ఇస్తారా? లేదా డబ్బులైనా ఇస్తారా? అంటూ భీష్మించాడు. తమవారు వచ్చిన వెంటనే ఇస్తారని చెప్పినా కనికరించలేదు. ఇది కేజీహెచ్‌లో ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌ వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం.

నగరానికి చెందిన ఎల్‌. అప్పారావు(72)కు గత శుక్రవారం కడుపు నొప్పి సమస్యతో సమీపంలో వైద్యులను సంప్రదించారు. మోషన్‌ అయ్యేందుకు మందులు వాడినా తగ్గలేదు. అనంతరం స్పెషలిస్ట్‌ వైద్యుడి సూచన మేరకు ఓ ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు చేయించారు. కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు తేలింది. దీంతో గత మంగళవారం కేజీహెచ్‌ ఎస్‌–4 వార్డులో చేర్పించారు. అక్కడ మరికొన్ని పరీక్షలు చేశారు. రిపోర్టుల ఆధారంగా అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించారు. సర్జరీ మూడు గంటలపాటు జరిగింది.

7 గంటల సమయంలో ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి రోగి తాలూకా ఎవరంటూ వార్డుబాయ్‌ పిలుపొచ్చింది. తామే అంటూ వెళ్లగా.. క్వార్టర్‌ బాటిల్‌ అయినా లేదా క్వార్టర్‌ బాటిల్‌కు డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇంతలో రోగి బంధువులు సెల్‌ఫోన్‌లో ఆ వ్యక్తి ఫొటో తీశారు. దీంతో వారిపై చిందులు వేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. ‘మా బాధలో మేము ఉండగా, మద్యం సేవించి ఆపరేషన్‌ థియేటర్లో ఉండడమే గాక.. మాపై విరుచుకుపడ్డాడు’ అని వాపోయారు. 

మహిళలపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న ఆపరేషన్‌ థియేటర్‌ ఉద్యోగి 

మరిన్ని వార్తలు