అంతా అయిపోయింది.. అమ్మకానికి కావలి టీడీపీ టికెట్‌.. షాడో ఇన్‌చార్జి పరిస్థితేంటో?

19 Dec, 2022 12:25 IST|Sakshi

వరుస ఓటములు.. పటిష్ట నాయకత్వ లేమితో కకావికలమైన కావలి టీడీపీ టికెట్‌ను ఆ పార్టీ అమ్మకానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చతికిలపడిన టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తిగా అంతర్థానం అయినట్లే అనిపిస్తోంది. నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ తన స్వగ్రామంలోనే రాజకీయ పరిపతి లేని ఒక ఫైనాన్షియర్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. అయితే సదరు నేతను కార్యకర్త నుంచి పార్టీ షాడో లీడర్‌ వరకు ఆసాంతం నాకేశారు. తాజాగా షాడో ఇన్‌చార్జి పెట్టుబడిదారులతో బేరసారాలు మొదలు పెట్టిన విషయం తెలుసుకుని సదరు ఇన్‌చార్జి గొల్లుముంటున్నాడు. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో కావలి నియోజకవర్గం టికెట్‌ను పెట్టుబడిదారులకు బేరం పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలకంటే 2019 ఎన్నికలకు మరింతగా బలపడిన వైఎస్సార్‌సీపీ తాజాగా క్షేత్రస్థాయిలో ఎదురులేని స్థాయిలో వేళ్లూనుకునిపోయింది. ఇదే సమయంలో వరుసగా రెండు దఫాలు ఓటమిని చవిచూసిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో బలమైన నేత లేకపోవడం చూస్తే ఆ పార్టీ స్థాయిని తెలియజేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై పైచేయి సాధించేందు డబ్బులు కుమ్మరించే పెట్టుబడిదారుడి కోసం వెతుకుతోంది.  

ఫైనాన్షియర్‌కు నియోజకవర్గ బాధ్యతలు 
ఏడాదిన్నర క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పూర్తిగా ప్రాభవం కోల్పోయిన టీడీపీ కావలి నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ కార్యకర్తలకు పెట్టుబడిదారుడిగా ఉండే నేత కోసం అన్వేషణ చేసింది. నియోజకవర్గంలోని దగదర్తి మండలానికి చెందిన గ్రామ స్థాయిలో కూడా రాజకీయ పరిపతి లేని వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమించింది. ఫైనాన్షియర్‌ అయిన ఆయన ఏడాది కాలంగా కార్యకర్తల నుంచి నియోజకవర్గ షాడో ఇన్‌చార్జి వరకు వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడంలో తన శక్తి మేరకు పాకులాడుతున్నాడు. సదరు నేత రాజకీయంగా స్వగ్రామంలోనే విఫల నేత అని తెలిసినా.. ఏదోక రకంగా పార్టీ నావను నడిపించాలని పార్టీ అగ్ర నాయకత్వం ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. 

ఔత్సాహికులకు షాడో నేత గాలం 
టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కావలి నియోజకవర్గానికి చెందిన షాడో నేత కావలి టీడీపీ టికెట్‌ ఇప్పిస్తానని ఔత్సాహికులకు గాలం వేస్తున్నట్లు సమాచారం. గడిచిన రెండు దఫాల సార్వత్రిక ఎన్నికల్లో కావలి టికెట్‌ ఆశించి చివరి క్షణంలో భంగపడిన సదరు నేత, ఆ పార్టీ వరుస ఓటములతో నియోజకవర్గానికి షాడో నేతగా మారారు. పార్టీని కాపాడుతున్నానని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేస్తూ.. రాజకీయాలు నెరుపుతున్న ఆ షాడో నేత రాజకీయ ఖర్చులకు ప్రస్తుత ఇన్‌చార్జిని వాడేసుకుని, తాజాగా కొత్త వ్యక్తులకు టికెట్‌ ఇప్పిస్తానని బేరం పెట్టినట్లు రాజకీయ గుసగసలు ఇప్పుడు కావలి టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

కావలిలో ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నేతలకు తప్ప కార్యకర్తలకు కనీసం అందుబాటులో ఉండని సదరు షాడో ఇప్పుడు పార్టీ శ్రేణులను మభ్యపెట్టిందుకు ఇటీవల కావలిలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పతనం కావడానికి మాజీనే కారణమని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కావలి టీడీపీకి సమర్థ నాయకుడు కావాలంటూ ఇన్‌చార్జిగా ఉన్న నేత ఎమ్మెల్యే అభ్యర్ధిత్వానికి సమర్థవంతుడు కాదనే భావం కలిగేలా ఆయన నాయకత్వాన్ని బలహీన పరిచేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తం మీద ‘కావలి టీడీపీ టికెట్‌ ఫర్‌ సేల్‌’ అనే ట్యాగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పకనే చెబుతోంది.   

మనస్తాపంలో టీడీపీ ఇన్‌చార్జి   
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ అధికార పార్టీపై పైచేయికి సర్వే రిపోర్ట్‌ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్‌ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది.

అంతర్గత రహస్య సర్వేలో నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు ధనవంతులైన ఆశావహుల పేర్లను సర్వే టీమ్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏడాదిగా తన శక్తికి మించి కావలిలో పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ పార్టీ అగ్ర నాయకత్వం తనను గుర్తించకపోవడం, రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న తనను కాదని మరొకరికి అవకాశం కల్పించామన్నారనే విషయం తెలిసి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు