మీకు టీకా వేశారా..? కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

27 Nov, 2021 04:29 IST|Sakshi

18 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు డోసులు తప్పనిసరి

వచ్చే నెలలో 100% వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వీలైనంత త్వరగా రెండు డోసుల కోవిడ్‌–19 టీకాను పూర్తి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 18 ఏళ్ల పైబడిన వారు రాష్ట్రంలో 3,95,22,000 మంది ఉండగా వీరిలో 3,42,40,668 మందికి తొలి డోసు, 2,40,97,400 మందికి రెండు డోసుల టీకా అందింది. దీంతో ఇంకా టీకా వేసుకోని వ్యక్తులను గుర్తించే పనిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి, టీకా వేసుకోని వారిని గుర్తిస్తున్నారు. ఇప్పటికి 3.65 కోట్ల మందిని సర్వే చేశారు. 

రోజువారీ లక్ష్యాలు
మూడో దశ వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం టీకా ప్రక్రియను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలనే ఉద్దేశ్యంతో జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించింది. 13 జిల్లాల్లో రోజుకు 8,81,690 డోసులు చొప్పున టీకాలు వేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

వచ్చే నెలలో పూర్తి
టీకా ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాం. ఏ రోజుకు ఆ రోజు టీకాలు వేస్తున్న తీరుపై జిల్లాల వారీగా సమీక్షిస్తున్నాం. వచ్చే నెలలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు డోసుల టీకా పూర్తయ్యేలా చర్యలుతీసుకుంటున్నాం. జిల్లాలకు రోజు వారీ లక్ష్యాలను కేటాయించాం. – కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు