ఊరూరా ఇంటి పట్టాల జాతర

21 Jan, 2021 03:33 IST|Sakshi
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ‘థాంక్యూ.. సీఎం సార్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న లబ్ధిదారులు

27వ రోజూ కోలాహలంగా ఇంటి పట్టాలు, ఇళ్ల పత్రాల పంపిణీ 

సొంతింటి కల సాకారమవుతోందని అక్కచెల్లెమ్మల ఆనందోత్సాహాలు 

కేటాయించిన స్థలాలు చూసుకుంటూ మురిసిపోతున్న పేద కుటుంబాలు 

సాక్షి నెట్‌వర్క్‌: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం 27వ రోజైన బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుండటంతో అక్కచెల్లెమ్మల ఆనందం అవధులు దాటుతోంది. ఎక్కడికక్కడ లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో కలిసి వస్తుండటంతో అక్కడ కోలాహలం జాతరను తలపిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల వద్ద ఎవరికి వారు సెల్ఫీలు దిగుతుండగా.. కొందరైతే పట్టాలు అందుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు.

వైఎస్సార్‌ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,818 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో  1,03,026 మంది ఇళ్ల పట్టాలు పొందారు. చిత్తూరు జిల్లాలో 58,122 మందికి పట్టాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా, ఎంఎస్‌ బాబు, నవాజ్‌ బాషా పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 2,396 మంది ఇళ్ల స్థలాలు, 1,077 మంది టిడ్కో ఇళ్ల పత్రాలు అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 4,973 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తం 70,949 మందికి లబ్ధి కలిగింది.  మరో 4,252 మందికి టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు.
ఒంగోలు మండలం కరవదిలో జగనన్న కాలనీ వద్ద ముగ్గు వేస్తున్న గ్రామస్తులు   

గుంటూరు జిల్లాలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పట్టాలను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో బుధవారం 651 మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. పశి్చమగోదావరి జిల్లాలో 662 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 318 మందికి పట్టాల పంపిణీ చేయగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో బుధవారం 2,263 మంది పట్టాలు అందుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 85,689 మందికి లబ్ధి చేకూరింది. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 1,187 ఇళ్ల పట్టాలు అందజేయగా..  ఇప్పటివరకు 62 వేల మందికి పైగా లబ్ధి పొందారు.  

మరిన్ని వార్తలు