ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చరిత్రాత్మకం

11 Feb, 2024 04:05 IST|Sakshi

ఇప్పటికి ఆరున్నర లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి

ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు గతంలో ఎప్పుడూ జరగలేదు 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ రామకృష్ణ

సాక్షి, అమరావతి: పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం విజయవంతంగా సాగు­తోందని, ఇది చరిత్రాత్మకమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఏపీలోనే తొలి­సారి జరుగుతోందని తెలిపారు. ఆయన శని­వారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్లపై వారికి పూర్తి హక్కు కల్పిస్తూ, వారికి ఒక ఆస్తిగా దాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే రికార్డు స్థాయి­లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు.

ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేయడం తమ శాఖకు చాలెంజింగ్‌ వంటిదని, అత్యంత క్లిష్టమైన ఈ పనిని అందరి సహకారంతో సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ చేయడానికి లక్షలాది మంది లబ్ధిదారుల ఆధార్‌ కార్డులు, వారి ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, హద్దులు, రెవె­న్యూ గ్రామాల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశామని చెప్పారు.

ఆ తర్వాత 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులను జాయింట్‌ సబ్‌ రిజి్రస్టార్లుగా గుర్తించడంతో వారికి లాగిన్లు ఇవ్వడం, ప్రభు­త్వం తరఫున రిజిస్ట్రేషన్లు చేసే 15 వేల మంది వీఆర్‌వోలకు లాగిన్లు ఇవ్వడం పూర్తి చేసినట్టు చెప్పారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఈ డేటా మొత్తాన్ని మ్యాపింగ్‌ చేశామన్నారు. ఈ పని చేయడమే అత్యంత క్లిష్టమని, దాన్ని పూర్తి చేయడంతో రిజిస్ట్రేషన్లు ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్లు వెల్లడించారు. వీరందరి ఆధార్‌ ఈ–సిగ్నేచర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల నకిలీ రిజిస్ట్రేషన్‌లకు అవకాశం లేదని చెప్పా­రు.  

సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు 
ఇప్పటివరకు 6.5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిచ్చిందని రామకృష్ణ తెలిపారు. సాధారణంగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయాలంటే రూ.5 వేల ఫీజు కట్టాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం మిన­హాయింపుని­చ్చినట్టు తెలిపారు. రోజుకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, త్వరలో ప్రభు­త్వం లక్ష్యానికనుగుణంగా అన్ని రిజిస్ట్రేష­న్లను పూర్తి చేస్తా­మని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంతో సాకా­రమైందని తెలిపారు.

మొన్న­టివరకు భూముల రీ సర్వే పూర్తయిన 4 వేల గ్రామాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేవారని, ఇప్పు­డు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పంచా­యతీ కార్యదర్శులు, సిబ్బందికి పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్‌ చేసే కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ గ్రామ స్థాయికి పూర్తిస్థాయిలో చేరిందన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ఈ–సిగ్నేచర్‌ యూజ­ర్లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు.  6.5 లక్షల రిజిస్ట్రేషన్ల కోసం 20 లక్షల ఈ–సిగ్నేచర్‌లు తీసుకున్నట్టు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల వల్ల వారు పొందిన స్థలాలపై పేదలకు హక్కు­లు ఏర్పడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఇచ్చే కన్వేయన్స్‌ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్‌ డీడ్‌లుగా మారడం వల్ల వారికి ఇబ్బందులుండవన్నారు. రెవెన్యూ ఎన్‌వోసీ లేకుండానే పదేళ్ల గడువు ముగిశాక ఆ స్థలాలపై పేదలకు సర్వ హక్కులు లభిస్తాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరమని రామకృష్ణ వివరించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega