పెరుగుతున్న గృహ విద్యుత్‌

12 Apr, 2021 04:06 IST|Sakshi

ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు, ఇతర గృహోపకరణాల వాడకమే కారణం.. ఆరేళ్లలో లక్షకుపైగా ఏసీల కొనుగోలు

మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటున్న సులభ వాయిదాలు

స్టార్‌ రేటెడ్‌ వస్తువులపైనే ప్రజల మక్కువ

ఇంధన ఆడిట్‌ విభాగం సర్వేలో వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ విద్యుత్‌ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. ఏటా 20 శాతం వరకు అదనపు వాడకం ఉంటోంది. రాష్ట్ర ఇంధన ఆడిట్‌ విభాగం జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 2015–16లో 11,356 మిలియన్‌ యూనిట్లున్న గృహ విద్యుత్‌ వినియోగం 2020–21 నాటికి 16,143 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఈ ఐదేళ్లలోనే 4,787 మిలియన్‌ యూనిట్లు పెరిగింది. 2018–19 తర్వాత ఏకంగా 3 వేల మిలియన్‌ యూనిట్ల వార్షిక పెరుగుదల నమోదైంది. మధ్యతరగతితోపాటు పేద వర్గాల్లోనూ విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తదితరాలతో కుటుంబాల్లో ఆదాయం పెరగడంతో విద్యుత్‌ ఉపకరణాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. 

రెండేళ్లలో 16 శాతం పెరిగిన ఫ్రిజ్‌లు, ఏసీలు
► 2015లో రాష్ట్ర విద్యుత్‌ వినియోగం మొత్తం 41,191 మిలియన్‌ యూనిట్లు. 2021 నాటికి ఇది 57,065 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఆరేళ్ల కాలంలో 15,874 మిలియన్‌ యూనిట్లు పెరిగింది. ఇందులో దాదాపు మూడో వంతు (4,787 మిలియన్‌ యూనిట్లు) గృహ విద్యుత్‌ వినియోగమే ఉంది.
► పేద, మధ్యతరగతి వర్గాల విద్యుత్‌ లోడ్‌ కనిష్టంగా 2 కిలోవాట్ల వరకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. టన్ను ఏసీ వినియోగిస్తే ఒక కిలోవాట్‌ లోడ్‌ పెరుగుతుంది.
► ఏసీలు, ఫ్రిజ్‌ల వినియోగం గత రెండేళ్లలో 16 శాతం పెరిగినట్టు మార్కెట్‌ సర్వేలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో వాషింగ్‌ మెషిన్లు, ఇతర గృహోపకరణాలున్నాయి.
► వినియోగదారులు ఎక్కువగా స్టార్‌ రేటెడ్‌ విద్యుత్‌ ఉపకరణాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇంధన పొదుపుపై అవగాహన పెరగడం, ఉత్పత్తిదారులు కూడా స్టార్‌ రేటెడ్‌ ఉపకరణాల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వడం వీటి పెరుగుదలకు కారణాలు. 

చేరువలో సులభ వాయిదాలు..
► పేద, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడంలో పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ముందుగా కొద్ది మొత్తాన్ని చెల్లించి, మిగతాది నెలనెలా సులభ వాయిదాలు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.
► ఇలా ఈఎంఐల ద్వారా ఎక్కువగా విద్యుత్‌ ఉపకరణాలే కొనుగోలు చేస్తున్నట్టు ఇటీవల సర్వేల ద్వారా వెల్లడైంది. ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో లక్షకుపైగా ఏసీల కొనుగోలు జరిగితే ఇందులో 85 శాతం సులభ వాయిదాలపై తీసుకున్నవే ఉన్నాయని విజయవాడలోని ఓ ఎలక్ట్రానిక్‌ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. 
► స్టార్‌ రేటెడ్‌ ఫ్యాన్లు, ఏసీలు, నీటి పంపుల ద్వారా విద్యుత్‌ పొదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్‌ పొదుపు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సులభ వాయిదాలతో ఉపకరణాలు అందిస్తున్నాయి. దీంతో గృహ విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది.

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం..
అన్ని వర్గాలు విద్యుత్‌ ఉపకరణాల వినియోగంపై దృష్టి పెట్టాయి. ఫలితంగా విద్యుత్‌ వాడకం పెరిగింది. ఆరేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్‌ వ్యవస్థలు బలోపేతంపై దృష్టి పెడుతున్నాయి. నాణ్యమైన విద్యుత్‌ అందించే దిశగా చర్యలు చేపట్టాం. 
– శ్రీకాంత్‌ నాగులాపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి 

మరిన్ని వార్తలు