ఇళ్లు నెలలో డబుల్‌

6 Jun, 2022 05:35 IST|Sakshi

వేగం పుంజుకున్న పేదల గృహ నిర్మాణాలు 

ఏప్రిల్‌కి పూర్తైనవి 27,420.. మే నెలలో మరో 27,136  

సగటున రోజూ సుమారు 900 ఇళ్ల నిర్మాణాలు పూర్తి 

రూ.950 కోట్ల బిల్లు చెల్లింపులు  

ఇక మరింత వేగం.. జిల్లాలకు రోజువారీ లక్ష్యాలు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. సిమెంట్, ఇసుక, ఇనుము, ఇతర వనరుల కొరత లేకుండా సరఫరా చేయడం, చకచకా బిల్లుల చెల్లింపులతో ఏప్రిల్‌ నాటికి 27,420 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మే నెలాఖరుకు రెట్టింపు కావడం గమనార్హం. ఒక్క మే నెలలోనే 27,136 గృహ నిర్మాణాలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తైన ఇళ్ల సంఖ్య 54,556కు చేరుకుంది. 

మరింత వేగం పెంచేలా 
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు దాదాపు 31 లక్షల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో 15,60,227 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 900 ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతుండగా ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు గృహ నిర్మాణ శాఖ సిద్ధమైంది. పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో నిర్మాణాల పురోగతిపై వాకబు చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

జేసీలు, గృహ నిర్మాణ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ప్రతి నెలా 75 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలని ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమయ్యారు. 

మొదటి స్థానంలో చిత్తూరు 
ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఆది నుంచి మంచి పనితీరు కనబరుస్తూ తొలి స్థానంలో నిలిచింది. విశాఖ, పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. పల్నాడు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఎన్టీఆర్‌ జిల్లాలు చివరి వరుసలో నిలిచాయి. 

రూ.950 కోట్లు చెల్లింపు 
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుష్కలంగా నిధులను అందుబాటులో ఉంచుతోంది. సక్రమంగా బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తని పక్షంలో మూడు, నాలుగు రోజుల్లో లబ్ధిదారులకు చెల్లింపులు చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.950 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు చేసింది. 

వివిధ దశల్లో 12.48 లక్షల ఇళ్లు  
దాదాపు 12.48 లక్షల ఇళ్లు శంకుస్థాపనలు పూర్తై నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని లేఅవుట్లలో భూమి చదును చేయడం, అప్రోచ్‌ రోడ్లు లాంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ నిర్మాణాలు ప్రారంభించలేదు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాగానే మిగిలిన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం. గృహ నిర్మాణాలకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నాం. లబ్ధిదారులకు ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తాం.  
– నారాయణ భరత్‌గుప్తా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ  

మరిన్ని వార్తలు