‘పట్టా’లతో పట్టలేని ఆనందం

13 Jan, 2021 03:42 IST|Sakshi
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌

ఉత్సాహంగా సాగుతున్న ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల పత్రాల పంపిణీ

19వ రోజూ రాష్ట్రవ్యాప్తంగా కోలాహలం

కల సాకారమవుతోందని అక్కచెల్లెమ్మల ఆనందోత్సాహాలు

కేటాయించిన స్థలాలు చూసుకుంటూ మురిసిపోతున్న వైనం

పట్టాలు అందుకున్న వెంటనే పలువురు శంకుస్థాపనలు

సాక్షి నెట్‌వర్క్‌: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యజ్ఞం మంగళవారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో సాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారమవుతోందని అక్కచెల్లెమ్మలు పట్టలేని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడ.. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో పెద్ద ఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా ఓ జాతరను తలపిస్తోంది. ఎవరికి వారు సెల్ఫీలు దిగుతున్నారు. కొందరైతే పట్టాలు తీసుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. 

► అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం పరిధిలో 19వ రోజు మంగళవారం 2,474 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 14 నియోజకవర్గాల పరిధిలో 85,761 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు పట్టాలను పంపిణీ చేశారు.
► చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం నాటికి 8,158 ఇళ్ల  పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. 
► కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో మంగళవారం 1,233 మందికి ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. అలాగే, ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మిగిలిన ప్రాంతాల్లో అధికారులు పట్టాల పంపిణీ చేపట్టారు.
► వైఎస్సార్‌ కడప జిల్లాలో మంగళవారం 3,901 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో మొత్తం 1,10,001 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయింది.
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం 1,582 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, 261 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు.
► ప్రకాశం జిల్లాలో మంగళవారం 762 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 84,027 మందికి పట్టాలివ్వాల్సి ఉండగా 63,360 మందికి పట్టాలిచ్చారు. అలాగే, జిల్లాలో మొత్తం 9,568 టిడ్కో ఇళ్ల సేల్‌ అగ్రిమెంట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 3,004 మందికి ఇచ్చారు.  
► గుంటూరు జిల్లాలో మంగళవారం 530 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ  చేశారు. 
► తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం వరకు 2,45,911 మందికి ఇళ్లు పట్టాలను పంపిణీ చేశారు. 1,93,506 మందికి ఇళ్ల పట్టాలు, 19,981 మందికి టిడ్‌కో గృహాలు, 32,424 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజు 3,094 ఇళ్ల స్థలాల పట్టాలు అందించినట్లు వివరించారు. అదే విధంగా 1,33,540 మందికి గృహనిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. 
► పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం మొత్తం 1,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 
► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1,293 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 19 రోజుల్లో 61,394 పట్టాలను అందజేశారు. 

మరిన్ని వార్తలు