కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో

1 Oct, 2022 10:51 IST|Sakshi

సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): పెళ్లంటే నూరేళ్ల పంట... మామిడాకులు, అరటి కొమ్మలు.. టెంకాయ పట్టలతో పెళ్లంటే పెద్ద సందడి. అయితే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టిచూడు అన్న సామెత ప్రకారం పెద్ద ఖర్చుతో కూడుకున్న తంతు. అందుకే నిరుపేదల పెళ్లిళకు ప్రభుత్వం కూడా తనవంతు సాయంగా కానుక అందించేందుకు సిద్ధమైంది.
చదవండి: ప్లీజ్‌.. తమ్ముళ్లూ ప్లీజ్‌.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు 

అయితే ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు చదువును ప్రోత్సహించడం, డ్రాపౌట్స్‌ను తగ్గించి అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన విధించింది. ఇకనుంచి కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. గతంలో టీడీపీ హయాంలో అంతంత మాత్రంగా అందిస్తుండగా, దాన్ని రెట్టింపు చేసి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ శనివారం నుంచి వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద అందించనుంది.  

వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి
ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్‌ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు.

మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్‌ అసిస్టెంట్‌(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్‌)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు