Landmark: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది..

5 Feb, 2022 16:55 IST|Sakshi
కారుషెడ్‌ కూడలి 

పీఎంపాలెం(భీమిలి): వాల్తేరు.. వైజాగ్‌.. విశాఖపట్నం.. ఇలా ముచ్చటైన పేర్లతో అలరారుతున్న విశాఖ మహా నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర ప్రాంతంలో విస్తరించిన సుందర నగరం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విశాఖ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు ప్రాంతం జగదాంబ ఎలాగో.. పీఎంపాలెం మధురవాడ ప్రాంత వాసులకు కారుషెడ్‌ అలాగ.! ఈ ప్రాంతవాసుల మాటల్లో తరచూ వినిపించే పేరు కార్‌షెడ్‌. నేను కార్‌షెడ్‌ దగ్గర ఉన్నాను.. కార్‌షెడ్‌కు దగ్గరకు వస్తావా? కార్‌షెడ్‌ వద్ద ఉండు.. ఇలా సాగుతుంటుంది. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వారైతే కార్‌షెడ్‌.. ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తారు. ఇక్కడ కారూ లేదు.. షెడ్డూ లేదు. దీనికి ఓ కథ మాత్రం ఉంది. చెన్నై– కోల్‌కతాకు వెళ్లే 16వ నంబర్‌ జాతీయ రహదారిలో విశాఖ శివారులో ఈ కూడలి ఉంది. ఈ కూడలి పేరే కార్‌షెడ్‌.

చదవండి: ఏపీలో ‘రేషన్‌ డోర్‌ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం 

ఆ పేరు ఎలా వచ్చిందంటే.? 
పోతిన వారి కుటుంబానికి చెందిన నర్సింనాయుడు 1960 ప్రాంతంలో తన హోదాకు తగ్గట్టుగా కారు కొనుక్కున్నారు. అప్పట్లో విశాఖ నుంచి ఆనందపురం, తగరపువలస మీదుగా విజయనగరం, శ్రీకాకుకుళం తదితర ప్రాంతాలకు వెళ్లడానికి చిన్న తారురోడ్డు ఉండేది. అదే ప్రధాన రహదారి. నర్సింనాయుడు కారయితే కొన్నారు గానీ.. కారుపై నేరుగా ఇంటికి వెళ్లడానికి అనుకూలమైన కనీస రహదారి లేదు. ప్రధాన రహదారి వద్ద కారు దిగి ఇంటికి నడిచి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆయన తన కారును పార్కింగ్‌ చేయడానికి రహదారికి సమీపంలో షెడ్‌ నిర్మించారు.

అప్పట్లో రోడ్డు మీద అడపాదడపా ప్రయాణించే ప్రైవేట్‌ బస్సులు తప్పితే.. మరో మోటారు వాహనం కనిపించేది కాదట. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో సొంత కారున్న వ్యక్తి నర్సింనాయుడు ఒక్కరే అని నిన్నటితరం పెద్దలు చెబుతారు. కారు కోసం నిర్మించిన షెడ్‌కు సమీపంలో చిన్న చిన్న దుకాణాలు, టీ కొట్లు వెలిశాయి. దీంతో అదో సెంటర్‌ అయిపోయింది. అలా కార్‌షెడ్‌ సెంటర్‌గా మారింది. ఈ ప్రాంతం మహా విశాఖలో విలీనం చేయడం, తారురోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతం తక్కువ సమయంలోనే విశేషంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి. అపార్టుమెంట్లు వెలిశాయి. 50 ఏళ్ల కిందట ఈ ప్రాంతం మొత్తానికి ఒకే కారు ఉంటే.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎదురెదురు వాహనాలు తప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

అప్పటి కారు ఇప్పుడు లేదు, ఆ కారు పార్కింగ్‌ కోసం నిర్మించిన షెడ్డూ లేదు. ప్రజల నాలుక మీద నడియాడిన కార్‌షెడ్‌ పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోయింది. జాతీయ రహదారి నుంచి పీఎంపాలెం–పాత పీఎంపాలెం వుడా రోడ్డుకు వెళ్లేందుకు, కొమ్మాది, చంద్రంపాలెం సర్వీసు రోడ్లకు వెళ్లడానికి వీలుగా నిర్మించిన కూడలిలో ట్రాఫిక్‌ పోలీసులు సిగ్నల్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు కారుషెడ్‌ సెంటర్‌ అంటే.. స్థానికులు మాత్రం కార్‌òÙడ్‌ అని పిలుస్తుంటారు. ఇదండీ కార్‌షెడ్‌ కథాకమామీషు!  

మరిన్ని వార్తలు