ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ 

9 May, 2023 09:55 IST|Sakshi

సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం నాటికి 3,38,407 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,037 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,370 మంది ఉన్నారు. ఈ మొత్తం దరఖాస్తులు గతేడాది ఆలస్య రుసుముతో చివరి గడువు నాటికి వచ్చిన వాటికంటే అధికంగా ఉండటం విశేషం. ఏపీ ఈఏపీసెట్‌కు రూ.5 వేల ఆలస్య రుసుముతో 12వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మంగళవారం నుంచి అభ్యర్థులకు cets.apsche.ap gov.in  వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు అందించనున్నారు.

మొత్తం 47 పరీక్ష కేంద్రాలు 
మన రాష్ట్రంలో 45, హైదరాబాద్‌లో రెండు కలిపి మొత్తం 47 ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అనకాపల్లి, అనంతపురం, గుత్తి, తాడిపత్రి, మదనపల్లి, రాజంపేట, బాపట్ల, చీరాల, చిత్తూరు, పలమనేరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, మైలవరం, తిరువూరు, విజయవాడ, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీకాకుళం, టెక్కలి, గూడూరు, పుత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, బొబ్బిలి, రాజాం, విజయనగరం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కడప, ప్రొద్దుటూరుల్లోను, హైదరాబాద్‌లో ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

రోజుకు రెండు సెషన్లలో.. ఆన్‌లైన్‌లో.. 
ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జేఎన్‌టీయూ అనంతపురం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఒక్కో విభాగంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో 160 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ఇలా ఇంజనీరింగ్‌ విభాగంలో గణితం 80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయ, ఫార్మా విభాగంలో బయాలజీ 80 (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

హాల్‌టికెట్లలో తేడాలుంటే.. 
ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లలో తేడాలుంటే 08554–23411, 232248 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలపవచ్చని, లేదా  జ్ఛి pఛ్ఛీటజ్చుp్ఛ్చpఛ్ఛ్టి–2023ః జఝ్చజీ .ఛిౌఝకు మెయిల్‌ పంపవచ్చని సెట్‌ రాష్ట్ర చైర్మన్‌ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శోభాబిందు తెలిపారు. హాల్‌టికెట్ల వెనుక వైపు బస్టాండు నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన మార్గాన్ని ముద్రించినట్లు చెప్పారు. ఉదయం సెషన్‌లో 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని వారు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు