YSRCP Plenary 2022: ప్లీనరీ పండుగకు ముస్తాబు

4 Jul, 2022 04:56 IST|Sakshi
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ వద్ద వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి సిద్ధమవుతున్న భారీ వేదిక

గ్రామ స్థాయి నుంచి నాయకులను ఆహ్వానిస్తూ సీఎం జగన్‌ లేఖలు

పెద్ద ఎత్తున హాజరు కానున్న శ్రేణులు.. శరవేగంగా ఏర్పాట్లు

నాగార్జున వర్సిటీ ఎదుట సువిశాల మైదానంలో భారీ వేదిక

భారీ వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల్లో టెంట్‌ 

టిఫిన్లు, భోజనాల తయారీకి రెండు భారీ వంటశాలలు

ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఆవిర్భవించాక 2011 జూలై 8, 9వ తేదీల్లో తొలి ప్లీనరీ జరగగా 2017 జూలై 8, 9వ తేదీల్లో రెండో ప్లీనరీని నిర్వహించారు. అంతకంటే మిన్నగా ఈ దఫా మూడో ప్లీనరీని జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్‌సీపీ విధానం. ఈ మేరకు ప్లీనరీల్లో తీసుకున్న నిర్ణయాలను, హామీలను  అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 95 శాతం అమలు చేశారు. రానున్న రెండేళ్లలో ప్రజలకు మరింత సేవ చేయడం, బాసటగా నిలిచి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే అజెండాగా మూడో ప్లీనరీని వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తోంది.

ప్రజాభ్యుదయమే లక్ష్యంగా..
ప్లీనరీకి విస్తృత స్థాయిలో ఆహ్వానాలు పంపుతున్నారు. గ్రామ, వార్డు సభ్యుల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారి వరకూ పేరుపేరునా ప్లీనరీకి ఆహ్వానిస్తూ సీఎం జగన్‌ లేఖలు రాశారు. వాటిని నాయకులకు అందచేసి ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆహ్వానిస్తున్నారు. తొలిరోజు ప్లీనరీకి పార్టీ నాయకులు హాజరుకానున్నారు.

రెండో రోజు మరింత విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభ ఉపన్యాసంతో ఆరంభమయ్యే ప్లీనరీ ఆయన ముగింపు ప్రసంగంతో ముగుస్తుంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

భారీ వేదిక.. భోజన శాలలు
రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే విజయవాడ–గుంటూరు రహదారి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో మూడో ప్లీనరీని వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తోంది. జాతీయ రహదారి నుంచి స్పష్టంగా కనిపించేలా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

భారీ వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ టెంట్‌ నిర్మాణ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ప్లీనరీకి హాజరయ్యే శ్రేణులకు వేడివేడిగా టిఫిన్లు, టీ, కాఫీలు, భోజనాల తయారీకి రెండు భారీ వంటశాలలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక వంటశాల పనులు కొలిక్కిరాగా రెండో వంటశాల పనులను సోమవారం ప్రారంభించనున్నారు. అక్కడకు సమీపంలోనే భారీ భోజన శాలలు సిద్ధమవుతున్నాయి.

ప్లీనరీకి విస్తృత స్థాయిలో శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు రానున్నాయి. ట్రాఫిక్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు–విజయవాడ ప్రధాన రహదారితో అనుసంధానిస్తూ ప్లీనరీకి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాలను సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు