104కు వచ్చిన కాల్స్‌ 6 లక్షలకు పైనే.. 

19 Oct, 2021 05:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సమయంలో అమల్లోకి తెచ్చిన 104 కాల్‌ సెంటర్‌ మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 104కు కాల్‌ చేసిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. ఇందులో 2.60 లక్షల మందికి పైగా వివిధ ఆరోగ్య సమస్యల సమాచారం తెలుసుకునేందుకు కాల్‌ చేశారు. 87 వేల మందికి పైగా కోవిడ్‌ టెస్టు ఫలితాల కోసం, టీకా కోసం 37 వేల మందికి పైగా, కోవిడ్‌ టెస్ట్‌ల కోసం 1.12 లక్షల మంది, ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం 96 వేల మందికి పైగా కాల్‌ చేశారు.

సోమవారం నాటికి వివిధ సమస్యల కోసం 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వారి సంఖ్య 6,01,410కి చేరింది. ఇప్పటికీ 104 కాల్‌ సెంటర్‌లో 333 మంది సిబ్బందితో పాటు వైద్యులు మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 489 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు కాల్‌ సెంటర్‌ అధికారులు చెప్పారు.   

మరిన్ని వార్తలు