‘జేఈఈ’ సెషన్‌–2కు అభ్యర్థుల తాకిడి

27 Mar, 2023 03:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీ­య విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జా­యింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌–2023 సెకండ్‌ సెషన్‌కు అభ్యర్థుల తాకిడి విపరీతంగా పెరగనుంది. జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్‌ పరీక్ష­లకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజ­రు­కా­నున్నారని ఆయా విద్యా సంస్థల ప్రతిని­ధు­లు అంచనా వేస్తున్నారు. జనవరి సెషన్‌ సమయంలో ఇంటర్‌ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా ఉండడంతో తొలిసెషన్‌ కన్నా రెండో సెషన్‌నే ఎక్కువ మంది ప్రాధాన్యతగా తీసుకు­న్నారు.

అయితే, ఈసారి తొలిసెషన్‌ పరీక్షలలో కూడా గతంలో కన్నా రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన తొలిసెషన్‌ కంప్యూటర్‌ ఆధారిత (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు–సీబీటీ) పరీక్షకు మొత్తం 8,60,064 మంది పేపర్‌–1కు.. 46,465 మంది పేపర్‌–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్‌–1కి 8,23,967 (95.80 శాతం) మంది.. పేపర్‌–2కి 95 శాతానికి పైగా హాజరయ్యారు. 

వచ్చేనెల 6 నుంచి రెండో సెషన్‌ పరీక్షలు
ఇక జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్‌ సెషన్‌ నిర్వహించే పట్టణాలకు సంబంధించిన సిటీ స్లిప్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారం ఆరంభంలో అభ్యర్థుల అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీయే విడుదల చేయనుంది.

ఇదిలా ఉంటే..  తొలి సెషన్‌ పరీక్షల సమయంలో ఇంటర్మీడియెట్, సీబీఎస్‌ఈ ప్లస్‌2కు సంబంధించిన ప్రాక్టికల్స్‌ నేపథ్యంలో విద్యార్థుల నుంచి పరీక్షల షెడ్యూల్‌లో మార్పుల కోసం అనేక వినతులు ఎన్‌టీయేకు అందాయి. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానంలో కేసులూ దాఖలు చేశారు. అయితే, పరీక్షల వాయిదాకు కోర్టు అంగీకరించలేదు. 

దేశవ్యాప్తంగా 574 పరీక్ష కేంద్రాలు..
ఇంటర్మీడియెట్‌ పరీక్షల సన్నద్ధత సమయంలోనే జేఈఈ తొలి సెషన్లో 8.6 లక్షల మందికిగాను 8.22 లక్షల మంది హాజరయ్యారు. రెండో సెషన్‌ ప్రారంభమయ్యే నాటికి ఇంటర్‌ పరీక్షలు పూర్తికానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువమంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయా కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

తొలి సెషన్‌లో పాల్గొన్న వారితో పాటు కొత్తగా మరింత మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లోని 574 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో  జరుగుతుంది.

తుది ఫలితాలు ఏప్రిల్‌ 30 లోపు
ఇక జేఈఈ మెయిన్‌ తుది ఫలితాలు ఏప్రిల్‌ 30లోపు వెలువడనున్నాయి. ఏప్రిల్‌ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశముంటుంది.

రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసెషన్లో దేశవ్యాప్తంగా 100 స్కోర్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. 100 స్కోర్‌ పాయింట్లతో పాటు అత్యధిక స్కోర్‌ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది తెలుగువారే. బాలికల్లో టాప్‌ స్కోరు పాయింట్లను సాధించిన వారిలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. 

మరిన్ని వార్తలు