రెడీ టు కుక్‌ తిండికి రెడీ అయ్యారా? ‘బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లకు అవకాశం ఉంటుంది’

25 Jul, 2022 15:03 IST|Sakshi

రెడీ టు కుక్, రెడీ టు ఈట్‌ విధానానికి ప్రజల మొగ్గు 

ఉరుకుల పరుగుల జీవనం.. కొత్త రుచుల కోసం ఆరాటం 

టిఫిన్‌ నుంచి డిన్నర్‌ వరకు రెడీమేడ్‌ ఫుడ్‌పైనే ఆధారం 

విస్తరిస్తున్న ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ మార్కెట్‌ 

ఇంటి ఆహారమే మేలంటున్న వైద్యులు 

సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగుల జీవన విధానం కారణంగా ఆహార సంస్కృతిలో భారీ మార్పులొస్తున్నాయి. పెద్దగా శ్రమపడకుండానే కోరుకున్న ఐటమ్స్‌ను వండుకునేందుకు వీలుగా ఉండే ‘రెడీ టు కుక్‌’ పదార్థాలకు డిమాండ్‌ పెరుగుతోంది.  ఆహార నాణ్యత గురించి ఆందోళన చెందకుండా ఒక రూపాయి ఎక్కువైనా చెల్లించడానికి వెనుకాడట్లేదు. ఈ క్రమంలోనే చాలా  ఆహార తయారీ కంపెనీలు వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా∙మెనూల్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. 

రెడీ టు కుక్‌ అంటే? 
ఈ విధానంలో ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని ఉడకబెట్టుకుని లేదా వేడి చేసుకుని తినేయాలి. వీటితో పాటు రెడీ టు కన్‌స్యూమ్‌ విధానంలో అప్పటికే తయారుచేసిన.. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలూ ఉన్నాయి. చిన్నారులు, యువత, వృత్తిరీత్యా వేర్వేరుగా ఉండే దంపతులు ఈ తరహా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నగ్గెట్స్, బ్రెడ్డెడ్‌ ఫింగర్స్, మీట్‌బాల్స్, సమోసాలు, చపాతీలు, కబాబ్‌లు, పఫ్స్, పాస్తా, శాకాహార, మాంసాహార పదార్థాలు ప్యాకింగ్, సెమీ కుక్డ్‌ విధానంలో మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అలాగే, పాలక్‌ పన్నీర్‌ నుంచి ఇడ్లీ సాంబార్‌ వరకు, బర్గర్‌ల నుంచి జాక్‌ఫ్రూట్‌ చికెన్‌ వరకు భారతీయుల రుచికి తగ్గట్టుగా రెడీ టు ఈట్‌ ఆహారం అందుబాటులోకి వచ్చింది.

ఉడికించిన శనగలు, వేగన్‌ మీట్‌ ఇన్‌స్టంట్‌గా లభిస్తున్నాయి. ఇడ్లీ పిండి, దోశె పిండి, ఇంట్లో చేసుకోకుండా బయట కొనుగోలు చేస్తున్నారు. వీటి అమ్మకాలు ఇటీవల దాదాపు 20 శాతం పెరిగాయి. టిన్‌ ప్యాక్డ్‌ స్వీట్లు కూడా మార్కెట్‌ను పెంచుకున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో మిల్లెట్స్‌ ఫుడ్స్‌పై ఆసక్తి పెరగడం.. అవికూడా రెడీమేడ్‌ ఆహారంగా లభిస్తుండటం విశేషం. కంపెనీలు సైతం పర్యావరణానికి ఇబ్బందిలేకుండా బయోడిగ్రేడబుల్‌ మెటీరియల్‌లో ఈ తరహా ఆహారాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరహా ఫుడ్స్‌.. ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.  

టిఫిన్‌ టు డిన్నర్‌! 
పట్టణీకరణ, ఆదాయ వృద్ధి, మధ్య తరగతి జీవనంలో మార్పులు కూడా ఇన్‌స్టంట్‌ కుక్‌కు ప్రాధాన్యత పెరగడానికి కారణం. ఎక్కువ సమయం తీసుకునే కూరగాయలను కోసే అవసరం లేకుండా వాటితో చేసే ప్యాకేజ్డ్‌ శాకాహార వంటకాల కోసం జనం ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో చాలామంది ప్రజలకు పోషకమైన భోజనం తయారు చేసుకోవడానికి సమయం ఉండట్లేదు. అందుకే దేశంలో ఐదేళ్లలో ఈ తరహా విధానం పెరుగుతోంది. రిటైల్‌ మార్కెట్లలో, సూపర్‌బజార్లలో, ఇతర స్టోర్లలో ఈ పదార్థాలు అందుబాటులో ఉంటున్నాయి. సమయాన్ని ఆదా చేసుకునేందుకు అల్పాహారం దగ్గర నుంచి రాత్రి డిన్నర్‌ వరకు ప్రజలు వీటిపైనే ఆధారపడుతున్నారు.  2026 నాటికి దేశంలో ఏడాదికి 18 శాతం పెరిగి.. రూ.8వేల కోట్ల వరకు మార్కెట్‌ విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఇంటి ఆహారమే మేలు  
ఇంట్లో తయారుచేసుకున్న తాజా ఆహారం తింటేనే ఆరోగ్యానికి మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తీసుకోవాలి. ప్యాకేజ్‌ ఫుడ్‌ నిల్వ ఉండేందుకు ఆయిల్, సాల్ట్‌ ఎక్కువగా వాడతారు. నాన్‌వెజ్‌ ఫుడ్‌ను ఎంత ఫ్రీజర్‌లో పెట్టినా నిల్వ ఉండటం మంచిదికాదు. ఒక్కోసారి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తినడంవల్ల జీర్ణకోశ సమస్యలొస్తాయి. వెజిటబుల్‌ ప్యాక్డ్‌ ఫుడ్‌ను ప్యాక్‌చేసి ఎన్ని రోజులైంది అనేది చెక్‌ చేసుకోవాలి.   
– డాక్టర్‌ గర్రే హరిత, న్యూట్రీషియనిస్ట్, విజయవాడ  

మరిన్ని వార్తలు